ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఇంకొల్లులోని ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయ కేంద్రంలో 102, పట్టభద్రుల కేంద్రంలో 1,231 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా వకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని 40 పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నామన్నారు. సమస్యాత్మకమైన ఇంకొల్లు, వేటపాలెం, చీరాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించామన్నారు. క్యూలైనులు, ఎన్నికల తీరును భద్రత చర్యలను పర్యవేక్షించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు చేస్తూ ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని, ఓటర్లు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఆయన వెంట చీరాల డిఎస్‌పి పి శ్రీకాంత్, రేపల్లె డిఎస్‌పి టి మురళీకృష్ణ, డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, ఇంకొల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి సూర్యనారాయణ, చీరాల 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ వి మల్లికార్జునరావు, చీరాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏ మల్లికార్జునరావు, తహశీల్దారు పి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.










