
డిపిఒ మల్లికార్జునరావు
ప్రజాశక్తి - పాలకోడేరు
మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి మల్లికార్జునరావు సూచించారు. మండలంలోని పాలకోడేరు, గరగపర్రు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. గరగపర్రు ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండడం, భవనం శిథిలావస్థకు చేరడంపై స్థానిక బిఎల్‌ఒలతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, లేదా మరోచోట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పాలకోడేరు మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్‌ఒలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి 1500 జనాభాకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 300 ఓట్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు ఏమైనా ఉంటే చూసి అక్కడ పోలిక కేంద్రం ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఇంటర్నెట్, భవనానికి తలుపులు, కిటికీలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నూకల మురళీగంగాధరరావు, తహశీల్దార్ షేక్ హుస్సేన్, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.