
ప్రజాశక్తి -నెల్లూరు అర్బన్ : ప్రతి ఒక్కరూ వారి వారి డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన జనసైనికులతో కలిసి నగరంలోని అన్ని డివిజన్లో ఉన్న పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుపై అధికారులు స్పెషల్ క్యాంప్ నిర్వహించారన్నారు. ఈ నేపథ్యంలో ఓటరు లిస్టులో పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు. లేకుంటే మళ్లీ ఓటు నమోదు చేసుకోవాలని ఓటర్లకు సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారు, మార్పులు, చేర్పులు తదితరు విషయాలను ఆయన బిఎల్‌ఒలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్, డివిజన్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.