Mar 14,2023 01:06
చీరాల పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

పజాశక్తి-చీరాల: చీరాల ప్రాంతంలో నిర్వహించిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రెవెన్యూ పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో సోమవారం ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పిఎం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 9 పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 మంది సిబ్బందిని, ఎస్‌ఐలను, ఇరవై మంది సిఐలను, ముగ్గురు డిఎస్పీ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పర్యటించిన వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు.
పోలయిన ఓట్ల వివరాలు
చీరాల మండలంలో మొత్తం తొమ్మిది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 45 బూత్‌లో మొత్తం 505 ఓట్లు ఉండగా 458 ఓట్లు (90 శాతం) పోలయ్యాయి. అదేవిధంగా 93 బూత్‌లో 830కి గాను 562 పోల్‌ అయ్యాయి. 93ఎ బూత్‌లో 847కి గాను 553 పోల్‌ అయ్యాయి. 94 బూత్‌లో 780కి గాను 526 పోల్‌ అయ్యాయి. 94ఎ బూత్‌లో 794 గాను 550 పోల్‌ అయ్యాయి. 95 బూత్‌లో 1293 గాను 945 పోల్‌ అయ్యాయి. 96 బూత్‌లో 1307 గాను 913 పోల్‌ అయ్యాయి. 97 బూత్‌లో 820 గాను 608 పోల్‌ అయ్యాయి. 98 బూత్‌లో 743 గాను 549 పోల్‌ అయ్యాయి. మొత్తంగా గ్రాడ్యుయేట్‌ పోలింగ్‌ శాతం 70.78 శాతం, ఉపాధ్యాయ పోలింగ్‌ 92.43 శాతంగా నమోదు అయ్యింది.
మార్టూరు రూరల్‌: తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక మద్ది సత్యనారాయణ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని 2,253 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 106లో 1210, బూత్‌ నంబర్‌ 107లో 887 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా బూత్‌ నంబర్‌ 51లో 151 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల గడువు ముగిసే సమయానికి 106వ బూత్‌లో 710 మంది, 107వ బూత్‌లో 482 మంది పట్టభద్రుల ఓట్లు మొత్తం 1,192 పోలయ్యాయి. అదే సమయానికి 51వ బూత్‌లో 151 ఉపాధ్యాయ ఓటర్లకు గాను 144 ఓట్లు పోలయ్యాయి. అందులో 90 మంది పురుష ఓట్లు, 54 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి పాఠశాల మెయిన్‌ గేట్‌ని అధికారులు మూసి వేశారు. ఆ సమయానికి పాఠశాల ప్రాంగణంలో క్యూలో ఉన్న షుమారు 350 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు స్లిప్పులు పంపిణీ చేసి ఓటింగ్‌కు అనుమతించారు. ఒక్కొక్క ఓటు వేయడానికి సగటున 7 నిముషాల నుంచి 10 నిముషాలు సమయం తీసుకోవడంతో ఉదయం నుంచి వోటింగ్‌ సరళి నింపాదిగా సాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అనూహ్యంగా పట్టభద్రుల ఓటర్లు ఓటింగ్‌ కోసం బారులు తీరారు. టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 107 బూత్‌లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
పంగులూరు: పంగులూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, సోమవారం జరిగిన శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రులకు రెండు బూత్‌లు కేటాయించగా, ఉపాధ్యాయులకు ఒక బూత్‌ను కేటాయించారు. మొదట్లో 10 గంటల వరకు మందగొండిగా సాగిన పోలింగ్‌, 11 గంటల నుంచి ఓటర్లు బారులుతీరి, ఎండను కూడా లెక్కచేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా శాసనమండలి ఎన్నికలు జరిగాయి. పట్టభద్రులకు కేటాయించిన 102 నంబర్‌ బూత్‌లో 708 ఓట్లకు గాను 575 పోలయ్యాయి.103 నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో, 780 ఓట్లకు గాను 611 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కేటాయించిన 48వ నెంబర్‌ బూత్‌లో, 58 ఓట్లకు గాను 56 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు మాత్రం పోల్‌ కాలేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్‌ బాగా జరిగినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.