
హిందూపురం : హిందూపురం నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పులు, పేర్ల మార్పుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం మండల పరిధిలో 1, పట్టణంలో- 13, లేపాక్షి మండలంలో 2, చిలమత్తూరు మండలంలో 2 పోలింగ్ కేంద్రాల మార్పులు చేస్తున్నామన్నారు. హిందూపురం రూరల్ 2, చిలమత్తూరు మండలంలో 14 పోలింగ్ కేంద్రాల పేర్లను మార్పు చేస్తున్నామని తెలిపారు. దీనిపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చించామని, మార్పునకు వారు సమ్మతం తెలిపినట్లు చెప్పారు. త్వరితగతిన ఈ ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ స్వర్ణలత, ఎంపీడీవో నరేంద్ర, సెరికల్చర్ ఏడీ సురేష్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్, ఎన్నికల సీఏ శ్రీనివాసరెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.