Mar 13,2023 01:16
అద్దంకిలో మాట్లాడుతున్న పోలీసు అధికారులు

పజాశక్తి-అద్దంకి: జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ నేతృత్వంలో నేడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన భద్రత, బందోబస్తు అవగాహనపై జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా ఏఎస్‌పి మహేష్‌, పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏఎస్‌పి మహేష్‌ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఏఎస్‌పి మహేష్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద పోలీస్‌ అధికారులు బందోబస్తు, పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, పోలీసులు పోలింగ్‌ అధికారి సూచనలు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు వరకు పోలింగ్‌ జరుగుతుందని, గంట గంటకూ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పోలీసులు సైరన్‌ మోగిస్తూ హడా వుడిగా ఉండాలని హెచ్చరించారు. బ్యాలెట్‌ బాక్సుల వద్ద సంబంధించిన పోలీస్‌ అధికారులు 24 గంటలు కట్టుదిట్టమై న కాపలా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బాపట్ల, చీరాల రూరల్‌, అద్దంకి సిఐలు వేణుగోపాల్‌ రెడ్డి, సోమశేఖర్‌, రోశయ్య, నియోజకవర్గంలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు, మహిళా ఎస్‌ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్‌: సోమవారం జరగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు నిర్వహించామని ఇంకొల్లు సిఐ వి సూర్యనారాయణరావు తెలిపారు. మొత్తం 60 మంది సిబ్బందితో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్త్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున పోలింగ్‌ బూత్‌కి కాని లొకేషన్‌కి కాని ఓటర్లు తప్ప వేరే వారికి అనుమతి లేదని మరియు అనవసరంగా సమావేశాలు జరపకూడదని పేర్కొన్నారు. మద్యం మరియు డబ్బులు పంచకుండా ఎక్కడికక్కడ చెసింగ్‌ పాయింట్లు వేసినట్లు తెలిపారు. ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోని ఇంకొల్లు, చిన్నగంజాం, కారంచేడు మండలాలలోని ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిఐ సూర్యనారాయణ కోరారు.