ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : తన వాహనానికి కేసు రాశారనే కోపంతో విద్యుత్ శాఖకు చెందిన లైన్‌మాన్ ఏకంగా పోలీస్ హెల్ప్ డెస్క్‌కు విద్యుత్ కనెక్షన్ కట్ చేసిన సంఘటన శుక్రవారం పార్వతీపురం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పోలీసు ట్రాఫిక్ నియంత్రణ విభాగం హెల్ప్ డెస్క్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ పాపారావు శుక్రవారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పోలీసుల ఆపుతున్నా ఆపకుండా వెళ్లిపోవడంతో వారిని వెనక్కు పిలిచి ఆన్లైన్ కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన వారు తాము విద్యుత్ శాఖకు చెందిన లైన్మెన్ మీ విధి నిర్వహణలో భాగంగా మీరు మాపై కేసులు నమోదు చేస్తే మా పని మేం చేస్తామంటూ హెల్ప్ డెస్క్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి సర్వీస్ వైరు కనెక్షన్ తొలగించడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరి ప్రవర్తనపై టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా సంబంధిత శాఖకు చెందిన అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్‌ఐ పాపారావు తెలిపారు.










