Aug 11,2023 20:57

హెల్త్‌ క్యాంపులో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణకాంత్‌

ప్రజాశక్తి - ఆదోని
ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని పోలీసు క్వార్టర్స్‌ ఆవరణలో కర్నూలు మెడికవర్‌, ఆదోని మధు ఆస్పత్రి ఆధ్వర్యంలో డీఎస్పీ శివనారాయణ స్వామి అధ్యక్షతన పోలీసులకు ఉచిత హెల్త్‌ చెకప్‌ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపునకు ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్‌ మాట్లాడారు. విధుల్లో భాగంగా గతంలో పోలీసులు సైకిల్‌పై బయటకు వెళ్లే వారని తెలిపారు. దీనివల్ల శరీరానికి కొంత వ్యాయామం లభించేదన్నారు. ఆరోగ్యం పదిలంగా ఉండేదన్నారు. ప్రస్తుతం బిజీ కారణంగా బైకులు, వాహనాలు ఉపయోగించడం వల్ల శరీర శ్రమ తగ్గి ఊబకాయం వస్తోందని తెలిపారు. బందోబస్తు విధుల్లో సమయానికి తిండి తినకపోవడంతో గ్యాస్‌ ట్రబుల్‌ ఏర్పడి శరీరం లావెక్కిన పరిస్థితి ఉందన్నారు. విధుల్లో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉండి ఎక్కువ ఆలోచించి మానసిక రుగ్మతలకు గురై అనారోగ్యాలు పాలైన వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. బిపి, షుగరు, కిడ్నీ, ఇతర వ్యాధులు కొందరిలో తీవ్రంగా వేధిస్తున్నాయన్నారు. ఇటీవల ట్రాన్స్‌ఫార్ల సమయంలో చాలామంది అనారోగ్య సమస్యలతోనే రిక్వెస్ట్‌ పెట్టుకున్నారని తెలిపారు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. డైట్‌లో రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలతో తయారు చేసిన వంటకాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. పోలీసుల ఆరోగ్య సంక్షేమ కోసం తనవంతు సహకారం ఉంటుందన్నారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ... పోలీసుల ఆరోగ్యం గురించి ఉచిత క్యాంపు పెట్టాలని అడగ్గానే ఆదోని మధు ఆస్పత్రి, కర్నూలు మెడికవర్‌ ఆస్పత్రి యాజమాన్యం ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. రూ.3500 విలువ గల హెల్త్‌ చెకప్‌ ఉచితంగా చేసేందుకు సహకరించడం అభినందనీయమన్నారు. డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ... ఆదోనిలోని ఎస్‌కెడి కాలనీలో మధు ఆస్పత్రిలో ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌, సామాన్యులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. హెల్త్‌ క్యాంపులో బిపి, షుగరు, ఈసీజీ, కిడ్నీ, కొలెస్ట్రాల్‌, చెవికి సంబంధించిన పరీక్షలు చేసి వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం డాక్టర్లను డీఎస్పీ శివ నారాయణ స్వామి సన్మానించారు. కర్నూలు మెడికవర్‌ ఆస్పత్రి డాక్టర్‌ సమీరా, మధు ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ శివశంకర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ సునీల్‌, ఆరోగ్య భద్రత విభాగం ఇన్‌ఛార్జీ జిలాని, సిఐ విక్రమ్‌ సింహ, నరసింహారాజు, శ్రీనివాస్‌ నాయక్‌, పార్థసారథి, ఎస్‌ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు.

పోలీసులకు వైద్య పరీక్షలు చేస్తున్న మధు ఆస్పత్రి డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ రెడ్డి
పోలీసులకు వైద్య పరీక్షలు చేస్తున్న మధు ఆస్పత్రి డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ రెడ్డి