Oct 22,2022 23:45

వివరాలు వెల్లడిస్తున్న ఒఎస్‌డి కృష్ణకాంత్‌, చిత్రంలో అరెస్టు చేసిన మావోయిస్టులు

ప్రజాశక్తి- చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పుంగ్‌గుట్ట శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, శబరి ఏరియా మిలిషియా కమాండర్‌ ముచ్చిక బుద్ర అలియాస్‌ సంతోష్‌, సంతు, కొవ్వా సి.మణికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం చింతూరు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డి కృష్ణకాంత్‌ మాట్లాడుతూ మావోయిస్టు కార్యకలాపాలు అరికట్టడంలో భాగంగా స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ పార్టీ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ముందస్తు సమాచారం మేరకు పొంగుట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో అనుమానితులుగా తిరుగుతూ మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా కొవ్వాసి మణికుమార్‌, ముచిక బుద్ధ అనే ఇరువురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి 12 డిటోనేటర్‌లు, కార్డ్‌ ఎక్స్‌ వైర్‌, కొన్ని ఇనుప ముక్కలు, ఒక ప్రెజర్‌ కుక్కర్‌ లభించాయని తెలిపారు. వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కొవ్వాసి మణికుమార్‌ ఎటపాక మండలం దొరగుంట గ్రామానికి చెందిన వాడని, మిలీషియా సభ్యులుగా చేరటం జరిగిందని పోలీసులు తెలిపారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతాయని చెప్పార.ఉ ఈ సమావేశంలో సెంథిల్‌ కుమార్‌, బి ఎన్‌ కమల్‌ వీర్‌, ఏఎస్‌పి కెవి మహేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.