Jul 28,2023 22:21

పోలీసు పరేడ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ :పోలీసుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత అని, సిబ్బందికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎస్పీ మాధవరెడ్డి భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి సమస్య ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించు కోవాలని సూచించారు. పట్టణంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో శుక్రవారం ఎఆర్‌ సాయుధ బలగాలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది, ప్పుట్టపర్తి అర్బన్‌, రూరల్‌ పరిధిలోని పోలీసు సిబ్బందితో నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి విధుల్లో లేదా ఇతర విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. పరేడ్‌ అనేది క్రమశిక్షణకు నిదర్శనమని, విధి నిర్వహణలో పరేడ్‌కి ఎంతో అవశ్యకత ఉందన్నారు. నెలలో కనీసం రెండుసార్లు అయినా పరేడ్‌లో పాల్గొనేలా చూసుకోవాలన్నారు. పరేడ్‌లో పాల్గొన్న మహిళా సిబ్బందిని, బ్యాండ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక పోలీసులు ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగా రోజూ గ్రౌండ్‌, ప్రాక్టీస్‌ మరవకూడదన్నారు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని, సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండి విధి నిర్వహణలో ఉత్సాహంగా ఉన్నప్పుడు సమాజం శాంతియుతంగా ఉంటుందని తెలిపారు. పరేడ్‌లో ఎఆర్‌డిఎస్‌పి విజరుకుమార్‌, ఆర్‌ఐలు, టైటస్‌, శ్రీశైలంరెడ్డి, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర ఏఆర్‌ సిబ్బంది, హోంగార్డులు, స్పెషల్‌ పార్టీ, పోలీస్‌ బ్యాండ్‌ సిబ్బంది పాల్గొన్నారు.