
ప్రజాశక్తి - మైలవరం : తమ జీవనాధారమైన గొర్రెల మృతికి నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. జాతీయరహదారి (30)పై బాధితులు ఆందోళనకు దిగారు. మైలవరం యాదవుల బజారుకు చెందిన పి.వెంకటేశ్వరరావు, బి.శివయ్య, సిహెచ్.శ్రీనివాసరావు, బి.నాగరాజు మరి కొంతమంది చండ్రగూడెం సమీపంలో పొలాల్లో గొర్రెలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారిపై నాగేంద్ర స్వామి ఆలయంవద్ద గొర్రెలను దారి మళ్లించే క్రమంలో రహదారి ఇరువైపులా ట్రాఫిక్‌ను ఆపి నాగేంద్ర స్వామి ఆలయం వైపు గొర్రెలను తోలుతున్నారు. ఇదే క్రమంలో ఎపి 9పి 7949 నంబర్ గల విజయవాడకు చెందిన పోలీస్ వాహనం విజయవాడ నుండి తిరువూరు వైపు వెళ్తుండగా నాగేంద్ర స్వామి ఆలయం వద్ద గొర్రెలను ఢకొీట్టింది. ఈ ఘటనలో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మతి చెందగా మరో 15 గొర్రెలకు కాళ్లు విరిగాయి. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ హరిప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని బాధితులతో గంటకు పైగానే చర్చించారు. మరోవైపు రహదారిపై అర కిలోమీటర్ పైగానే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పలువురు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఆందోళన చేసేవారితో వాగ్వాదానికి దిగారు. మరోసారి ఎస్‌ఐ హరిప్రసాద్ న్యాయం చేస్తామని స్టేషన్‌కు రావాలని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు.