Oct 21,2023 20:37

నివాళులర్పిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం : పోలీసుల త్యాగాల వల్లే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని స్మృతి వనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్మృతి స్తూపం వద్ద కోలగట్ల, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక పాటిల్‌, ఎఎస్‌పి అస్మా ఫర్హీన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తేనే దేశంలో ప్రజలంతా సుఖంగా ఉంటారని తెలిపారు. విధి నిర్వహణలో వేరే ఆలోచనలు లేకుండా, పరిస్థితులకు అనుగుణంగా, అన్నింటిని అతి సూక్ష్మంగా పరిశీలిస్తూ, గంటల తరబడి నిలబడి, అంకితభావంతో విధులను నిర్వహిస్తున్నారన్నారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులు మనందరిలో చిరంజీవులుగా నిలిచిపోతారన్నారు. కలెక్టరు ఎస్‌.నాగలక్ష్మి మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడుటలో భాగంగా పోలీసులు రోజువారి విధులను నిర్వహించే క్రమంలో ప్రాణాలను కూడా కోల్పోతున్నారన్నారు. మావోయిస్టు దాడుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఎస్‌పి కార్యాలయం నుండి దిశ పోలీసు స్టేషను వరకు ఎస్‌పి ఎం.దీపిక ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల సేవలను కీర్తిస్తూ, ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. రిజర్వు ఇన్‌స్పెక్టరు ఎన్‌.గోపాలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్‌ నిర్వహించారు. అమర వీరులకు తుపాకుల విన్యాసంతో ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ఎస్‌ఇబి ఎఎస్‌పి ఎస్‌.వెంకటరావు, ఎఆర్‌ ఎఎస్‌పి ఎం.ఎం.సోల్మన్‌, డిఎస్‌పిలు ఆర్‌.గోవిందరావు, డి.విశ్వనాథ్‌, అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటిలిజెన్సు అధికారి లలిత్‌ మోహన్‌ పండా, డాక్టర్‌ మురళీ మోహన్‌, సిఐలు విజయనాథ్‌, ఇ.నర్సింహమూర్తి, జె.మురళి, బి.వెంకటరావు, ఎన్‌.హెచ్‌.విజయ ఆనంద్‌, టి.వి.తిరుపతిరావు, బి.నాగేశ్వరరావు, ఎం.బుచ్చిరాజు, ఆర్‌ఐ ఎన్‌.గోపాల నాయుడు, డిపిఒ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు, పోలీసు అసోసియేషను రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
పోలీసు అమర వీరుల కుటుంబాలతో ఎస్‌పి ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులు షేక్‌ ఇస్మాయిల్‌ సతీమణి షేక్‌ బాబీ జాన్‌, సూర్యనారాయణ సతీమణి రాజు, చిరంజీవిరావు సతీమణి విశాలాక్షితో మమేకమై, వారి యోగ క్షేమాలు, పిల్లల చదువు గురించి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేసి, కొంత సమయాన్ని గడిపారు. పండ్లు, నగదును ఎస్‌పి అందజేశారు. ఎప్పుడు ఏ అవసరమున్నా తమను సంప్రదించవచ్చని, అండగా ఉంటామన్న భరోసాను ఎస్‌పి దీపిక కల్పించారు.