ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది కొరకు ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్‌లో ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా శనివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఈసారి అపోలో డాక్టర్లచే పోలీసు సిబ్బంది, విశ్రాంత సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేయటం జరిగిందని తెలియజేశారు. పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, వారి డ్యూటీ సమయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయని, ఆహారం కూడా సమయానికి తీసుకోలేని పరిస్థితులు ఉంటాయని, విధి నిర్వహణలో వారి ఆరోగ్య ప్రాధాన్యత కంటే ప్రజాభద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో వైద్యపరీక్షలు చేయించి, ఆరోగ్యపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల సేవకే అంకితమైన పోలీస్‌సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం చిత్తూరులో లయన్స్ క్లబ్, జిల్లా వైద్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల పర్యవేక్షణలో పోలీసు శ్వేదమహిళల బ్యారక్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరానికి తరలి వచ్చిన పోలీసులకు వీరితో పాటు అడిషనల్ ఎస్పి ఏఆర్ జి.నాగేశ్వరరావు రక్తదానం చేసి, రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అడిషనల్ ఎస్పీలు సుధాకర్, శ్రీలక్ష్మి పోలీస్ ఉన్నతాధికారులు నాగేశ్వరరావు, డిఎస్పీ శ్రీనివాసమూర్తిలతో పాటు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










