Oct 26,2023 21:25

తుపాకుల వినియోగంపై విద్యార్థులకు వివరిస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి-విజయనగరం :  పోలీసుశాఖ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకే ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండులో 'ఓపెన్‌ హౌస్‌' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎస్‌పి ఎం.దీపిక, పోలీసు అధికారులు 'ఓపెన్‌ హౌస్‌'ను సందర్శించి, విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీసుశాఖనిర్వహించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలు పట్ల అవగాహన కల్పించి, వారిలో స్ఫూర్తి నింపారు. పోలీసుశాఖ కేసులు చేధనలో ఉపయోగించే సాంకేతికత, కమ్యూనికేషన్‌, బాంబ్‌ డిటెక్షన్‌, డిస్పోజల్‌, వివిధ ఆయుధాలు, డ్రోన్స్‌ వినియోగం, వేలి ముద్రల సేకరణ, బాడివార్న్‌ కెమెరాలు, లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ట్రాఫిక్‌ పోలీసులు వినియోగించే బ్రీత్‌ ఎనలైజర్స్‌ మరియు ఇతర పరికాలు, నేర పరిశోధనలోను, బాంబులను గుర్తించడంలో పోలీసు డాగ్‌ల పని తీరు, బాంబ్‌ డిస్పోజల్‌ పరికరాలు, దిశ యాప్‌ గురించి విద్యార్థులకు, ప్రజలకు వివరించారు. ఎస్‌పి విద్యార్ధులకు కొన్ని ప్రశ్నలు వేసి, వాటికి సరైన జవాబులు చెప్పిన విద్యార్థులకు ఎకె 47 ఆయుధంతో ఫోటోలు తీయించి, వాటిని విద్యార్ధులకు బహూకరించారు. జిల్లా పోలీసు శాఖలో కమ్యునికేషన్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. దిశాయాప్‌ మనతో ఉంటే - రక్షణ మన వెంటే అని అన్నారు. కార్యక్రమం లో అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌, ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎస్‌.వెంకటరావు, సిఐలు కెకెవి విజయనాధ్‌, ఇ.నర్సింహమూర్తి, డిసిఆర్‌బి సిఐ జె.మురళి, విజయనగరం రూరల్‌ సిఐ టి.వి. తిరుపతిరావు, దిశ సిఐ బి. నాగేశ్వరరావు, నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.