Jan 18,2023 22:36

మాట్లాడుతున్న ఎస్‌పి గౌతమి శాలి

ప్రజాశక్తి-అనకాపల్లి
స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అనకాపల్లిలో 11, చోడవరంలో 5, మునగపాకలో 2, అచ్యుతాపురంలో 2, మాకవరపాలెంలో 1, మొత్తం 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 9,897 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరిలో 2,781 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 10 గంటల తర్వాత ఒక నిమిషం దాటిన పరీక్షకు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. అభ్యర్థుల విలువైన సామాన్లు వారే జాగ్రత్త చేసుకోవాలన్నారు. హాల్‌ టికెట్లలో సూచించిన నియమ నిబంధనలు పాటించాలని, మొబైల్‌, డిజిటల్‌ వాచ్లు, బ్లూటూత్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదన్నారు. సెక్షన్‌ 144 అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జెరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని, ప్రజలు గుమ్మిగూడడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం అనకాపల్లి, చోడవరంలో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు నోడల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ ఎస్పీ బి.విజయభాస్కర్‌తో పాటు వివిధ పరీక్ష కేంద్రాల వద్ద నలుగురు డిఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారులతో ఫ్లయింగ్‌ స్క్వాడ్లు నియమించినట్లు తెలిపారు. రాత పరీక్షల నిమిత్తం అనకాపల్లి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌గా డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చల్ల నరసింహం తోపాటు 21 పరీక్ష కేంద్రాల్లో 21 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లను, 25 మంది అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు.