* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: విధి నిర్వహణలో అనారోగ్యం, ప్రమాదం తదితర కారణాల రీత్యా మరణించిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్‌పి జి.ఆర్ రాధిక భరోసానిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులతో మరణించిన పోలీసు ఉద్యోగి కుటుంబ సభ్యులకు రావాల్సిన బెనిఫిట్స్ కారుణ్య నియామకం కింద ఉద్యోగం, ఇతరత్రా ప్రయోజనాలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగి అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ ప్రయోజనం త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని, ఎవరైనా ఇష్టపూర్వమైతే పోలీస్ ప్రధాన కార్యాలయానికి ప్రపోజల్ పంపించి ఉద్యోగం త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉద్యోగ ఖాళీలు తక్కువగా ఉన్నాయని, ఉద్యోగం వచ్చేందుకు ఆలస్యమవుతుందని తెలిపారు. ఇప్పటికే కొంతమంది వివరాలను కలెక్టరేట్‌కు పంపించామని చెప్పారు. ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పుడు ఎటువంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. సమావేశంలో కార్యక్రమంలో ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, ఎఆర్ డిఎస్‌పి డి.ప్రసాదరావు, సహాయ పరిపాలనా అధికారి జి.సత్య శోభారాణి, సెక్షన్ సూపరింటెండెంట్లు వై.లిల్లీబాయి, శ్రీనివాసరావు, బాలరాజు, కార్యాలయ సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










