ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలం 'జ్యోతి'కి జిల్లా అదనపు ఎస్పీ (ఎఆర్) రామచంద్రరాజు, ఇతర పోలీసు అధికారులు బుధవారం పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంనతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ 2014లో జన్మించిన లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఆడ జాగిలం 'జ్యోతి' అప్పటి గుంటూరు రూరల్ జిల్లా (ఇప్పటి పల్నాడు జిల్లా)లోని జిల్లా భద్రతా విభాగంలో విధి నిర్వహణ ప్రారంభించిందని చెప్పారు. ఎనిమిదేళ్లపాటు అనేక మంది వీవీఐపీ, వీఐపీ భద్రత విధులలో విశేష సేవలు అందించడంతోపాటు పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలను పొందిందని చెప్పారు. వయస్సు రీత్యా కొంత కాలంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంటి ఆర్‌ఐ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.










