ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రెండో పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం గురు, శుక్రవారం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి, పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధరకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి కళాశాల, పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఆయుధాల గురించి ఎఆర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి వివరించారు.
ప్రదర్శనలో ఉంచిన విభాగాలు..
డాగ్ స్క్వాడ్, ఆయుధాల ప్రదర్సన, బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విభాగం, కమ్యూనికేషన్ విభాగం, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీం, ట్రాఫిక్ విభాగం, దిశా యాప్‌పై అవగాహన, పోలీస్ ఆఫీసర్స్ కేడర్స్, ఎర్రచందనం, ఎస్‌ఈబీ, సైబర్ క్రైమ్ ప్రత్యేక స్టాల్‌ను ప్రదర్శన చేసి సైబర్‌నేరాల పట్ల యువతలో అవగాహన కల్పించారు, పోలీస్ వాహనాల ప్రదరశన, ఫ్రీగో వెహికల్స్, దిశా మొబైల్ రెస్ట్ రూమ్స్ వాహనం తదితర వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రత్యేక ధియేటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పోలీసుల త్యాగాలు, సైబర్ క్రైమ్ వీడియోలు ప్రదర్శించారు.










