Oct 22,2023 00:24

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి సాయిధ దళాలు, పోలీసు అమరవీరుల త్యాగాలు ఎనలేనివని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ పాత జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, కాకినాడ రూరల్‌, సిటీ, పిఠాపురం ఎంఎల్‌ఎలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఎఎస్‌పిలు పి.శ్రీనివాస్‌, ప్రేమ్‌ కాజల్‌, తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ నిత్యం మనకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా వారు చేసిన త్యాగాలకు రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. సుమారుగా 20 ఏళ్లకు పైగా మరణించిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాలతో పాటు కొంత మందికి ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిం చేందుకు కృషి చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నారన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్‌ దళాలు నిలుస్తున్నాయన్నారు. పోలీస్‌ అమర వీరుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారన్నారు. 2022, సెప్టెంబర్‌ 1 నుంచి 2023, ఆగస్టు 31 వరకు దేశంలో 188 మంది, రాష్ట్రంలో ఒకరు విధి నిర్వహణలో అసువులు బాసారని.. వారి త్యాగాలు మరువలేనివని ఎస్‌పి పేర్కొన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహకారంతో పాటు ఇళ్ల స్థలాల పట్టాలను ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శ క్లా, ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందజేశారు. అనంతరం ర్యాలీని కలెక్టర్‌, ఎస్‌పి ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.