ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులుర, ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొని విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు.
అమలాపురం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్‌పి ఎస్.శ్రీధర్ ఘన నివాళులు అర్పించారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్‌పి కార్యాలయంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్‌పి ఎస్.శ్రీధర్, పి.గన్నవరం ఎంఎల్‌ఎకొండేటి చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అడిషనల్ ఎస్‌పి ఖాదర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..తర్వాత అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ సమాజంలోని అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలందరికీ సేవలు అందిస్తున్న జిల్లా ఎస్‌పి నేతత్వంలోని పోలీసుల అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్‌పి ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో జరిగిన రెండు ముఖ్యమైన సంఘటన ప్రస్తావించారు. గత మేలో యానాం- ఎదురులంక వారధి పైనుంచి ఒక మహిళ గోదావరి నదిలో దూకిన సంఘటనలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నదిలో దూకి ఆ మహిళ ప్రాణాలు కాపాడాడని అన్నారు. రావులపాలెం బ్రిడ్జి మీద ఒక పాప అర్ధరాత్రి పూట వేలాడుతూ ఉందని సమాచారం అందగానే వెంటనే వెళ్లి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. గడచిన సంవత్సర కాలం లో జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ముగ్గురు పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు విడిచిన విఎస్.సాయి బాబా కుటుంబ సభ్యులకు గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమం అనంతరం ర్యాలీనీ జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మామిడికుదురు నగరం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి మామిడికుదురు సెంటర్ వరకు 216 వ జాతీయ రహదారిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్‌ఐ పి.సురేష్ కుమార్, మహిళా పోలీసులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబాజీపేట సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎ.చైతన్య కుమార్, అఖిలపక్ష నాయకుల తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సంయుక్తంగా ఆలమూరులో ఎస్‌ఐ ఎల్.శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఎఎస్‌ఐ సూర్యచంద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..










