ప్రజాశక్తి - తాడికొండ : దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట కంతేరు గ్రామ దళితులు శుక్రవారం బైఠాయించారు. పాత కక్షల నేపథ్యంలో తమవారిపై నంబూరు, వెనిగండ్ల, కొప్పురావూరు, కంతేరు గ్రామాలకు చెందిన పెత్తందారీ సామాజిక తరగతుల యువకులు గురువారం దాడి చేశారని, వారిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు స్టేషన్‌కు వెళ్లగా వారిని స్థానిక సిఐ జి.శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. దాడిని ప్రోత్సహించిన కళ్లం హరికష్ణరెడ్డి, అతని సోదరుడు మనోహర్‌రెడ్డి నుండి ఫిర్యాదు తీసుకున్న సిఐ దళితులపైనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. దాడిలో గాయపడిన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ సిఐతో వాగ్వాదానికి దిగారు. కళ్లం హరికష్ణరెడ్డి రౌడీషీటర్ అని, స్టేషన్‌లోనూ అతని ఫొటో ఉందని, అలాంటిది అతని ఫిర్యాదుతో దళితులకు అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. కేసు నమోదుకు డబ్బెంత తీసుకున్నారని నిలదీశారు. హరికష్ణరెడ్డి అతని అనుచరులైన 40 మందిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని దీనిపై మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షులు డి.హేమప్రసాద్ డిమాండ్ చేశారు. స్టేషన్ బెయిలు ఇస్తే ఊరుకునేలేదని, గ్రామంలో దళితులు బిక్కు బిక్కు మంటూ బతుకుతుంటే హరికష్ణరెడ్డి ఇంటి వద్ద సిఐ శ్రీనివాసరావు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని దుయ్యపట్టారు. దళితులకు న్యాయం చేయకుంటే అన్ని దళిత సంఘాలతో హైవేను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. గంటసేపు ఆందోళన అనంతరం వారితో మాట్లాడిన సిఐ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.










