ఎసిపి డాక్టర్ ప్రేమకాజల్
ప్రజాశక్తి -మధురవాడ : పోలీస్ వ్యవస్థ ద్వారానే సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని దిశ మహిళా పోలీస్‌స్టేషన్ సహయ పోలీస్ కమిషనర్ డాక్టర్ ప్రేమా కాజల్ అన్నారు. అంతర్జాతీయ శాంతిస్థాపన దినోత్సవం సందర్భంగా బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు కొత్తగా ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరంను ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆధునిక సమాజంలో నేరాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయన్నార. డ్రగ్స్, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలకు వేధింపులు, ఫోర్నోగ్రఫీ వంటివి పెరుగుతుండడంతో కొత్తచట్టాలు, ఆధునిక పోలిసింగ్ అవసరం ఏర్పడిందన్నారు. మహిళల రక్షణకు దిశ యాప్, సైబర్ నేరాలపై 1930 టోల్ ఫ్రీనెంబర్, డ్రగ్స్ సమాచారం అందించడానికి 14500 నెంబరు అందుబాటులో ఉన్నాయన్నారు. సమాజంలో శాంతిస్థాపనకు పౌరులుగా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైలులో గర్భిణి ప్రసవానికి సాహసోపేతంగా సహకరించిన వైద్యవిద్యార్థిని స్వాతీరెడ్డిని అభినందించారు. గీతం మహిళా సాధికారిత విభాగం ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ చల్లా సురేఖ పాల్గొన్నారు.










