మహిళా పోలీసుల విధులపై పోలీస్ అధికారులకు ఎస్‌పిలు స్పష్టమైన ఆదేశాలు
బందోబస్తు, రిసెప్షన్, శాంతిభద్రతల విధులు అప్పగించొద్దని స్పష్టం
తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తే చర్యలే
ఎట్టకేలకు ఫలించిన మహిళా పోలీసుల జాబ్‌ఛార్ట్ పోరు
క్షేత్రస్థాయిలో అమలుపై అనుమానాలు వెల్లువ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులు) పోలీస్‌స్టేషన్‌లో విధులు కేటాయిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని డిజిపి ఆదేశాల మేరకు జిల్లా ఎస్‌పిలు స్పష్టంగా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తు, రిసెప్షన్, శాంతిభద్రతలు వంటి పనులకు మహిళా పోలీసులను వినియోగించడం, తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం వంటివి చేయకూడదని తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో మహిళా పోలీసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మహిళా పోలీసులకు సంబంధించిన జాబ్‌ఛార్ట్ అమలు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు మహిళా పోలీసుల పోరు ఫలించింది. మహిళా పోలీసులకు పోలీస్ విధులు కేటాయించబోమని రాష్ట్ర డిజిపినే స్పష్టం చేశారు. మహిళా పోలీసులకు సంబంధించిన జాబ్‌ఛార్ట్ వివాదంపై ఒకసారి పరిశీలిస్తే వారు చేసిన పోరాటం, సాధించిన గెలుపు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ సచివాలయాల్లో 11 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను నియమించింది. దీనిలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, సర్వేయర్ వంటి పోస్టులతోపాటు గ్రామంలో మహిళల రక్షణకు సంబంధించి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగులను నియమించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 900కుపైగా గ్రామసచివాయాలు ఏర్పాటవ్వగా ప్రతి సచివాలయంలోనూ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు నియమితులయ్యారు. వీరినే మహిళా పోలీసులగా పిలుస్తున్న పరిస్థితి ఉంది. మహిళా పోలీసులకు సంబంధించిన విధుల గురించి ఉద్యోగ నియామకాల సందర్భంగా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గ్రామ సచివాలయ పరిధిలో నేరాలకు సంబంధించిన సమాచారం పోలీస్‌స్టేషన్లకు ఇవ్వడం, మహిళలకు సంబంధించిన కేసులు సచివాలయ పరిధిలో జరిగితే హాజరుకావడం, సచివాలయ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించడం, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పించడం, గ్రామస్తులకు చట్టాల గురించి తెలియజేయడం వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంది. అయితే మహిళా పోలీసులకు అందుకు విరుద్ధంగా విధులు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది.
నిబంధనలు ఒకటి.. విధులు మరొకటి..!
మహిళా పోలీసులకు ప్రభుత్వం చెప్పిన జాబ్‌ఛార్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. వీరికి పూర్తిగా పోలీస్‌శాఖలో పనులు అప్పగించడం ప్రారంభించారు. సిఎం, విఐపిల పర్యటనలకు గ్రామాల్లో జాతరలు వంటి కార్యక్రమాలు జరిగితే బందోబస్తులకు, ఎస్‌ఐ, కానిస్టేబుల్ వంటి పరీక్షలు, పదోతరగతి, ఇంటర్ పరీక్షల కేంద్రాల వద్ద బందోబస్తులకు, రాత్రి 12 గంటల వరకూ డ్యూటీలు వేయడం వంటివి చేస్తున్నారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ ప్రభుత్వం జిఒ జారీ చేయగా దీనిపై కొంతమంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ జిఒను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టులో తెలిపినప్పటికీ విధుల కేటాయింపు మాత్రం క్షేత్రస్థాయిలో ఆగలేదు. దీంతో మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సిఐలు, ఎస్‌ఐలు కానిస్టేబుళ్లు ఉన్నా మహిళా పోలీసులకే విధులు కేటాయించడం, వినకపోతే మెమోలు వంటివి జారీ చేస్తూ వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దీనిపై మహిళా పోలీసులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కోర్టు విచారణ సందర్భంగా మహిళా పోలీసులకు పోలీస్ విధులు కేటాయించబోమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిజిపి ఆదేశాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. అందులో భాగంగా శుక్రవారం మహిళా పోలీసులకు సంబంధించి పోలీస్ విధులు కేటాయించొద్దని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ డిజిపి జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం రెండు జిల్లాల ఎస్‌పిలు కిందిస్థాయి సిబ్బందికి మహిళా పోలీసులకు పోలీస్ విధులు కేటాయించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
క్షేత్రస్థాయిలో అమలుపై అనుమానాలే
మహిళా పోలీసులకు పోలీస్ విధులు కేటాయించొద్దని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుపై పలు అనుమానాలు నెలకొన్నాయి. సిఐ, ఎస్‌ఐలు ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తారా అనే సందేహాలు అలముకున్నాయి. మహిళా పోలీసులను బెదిరించి, సమీక్షల పేరుతో స్టేషన్‌కు పిలిపించి పనులు చేయించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మహిళా పోలీసులు తమ జాబ్‌ఛార్ట్ ప్రకారం పనిచేస్తారా, మళ్లీ పోలీస్ అధికారుల బెదిరింపులకు భయపడి తలొగ్గుతారా అనేది వేచిచూడాలి.










