Aug 29,2023 23:31

ప్రజాశక్తి - కారంచేడు
బహిరంగా ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు. తొలుత సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. వివిధ కేసులలో సీజ్ చేసిన ప్రాపర్టీని, వాహనాలను పరిశీలించారు.
సచివాలయ మహిళా పోలీసులు, పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. స్టేషన్‌ పరిధిలో తరచు జరుగుతున్న నేరాల గురించి ఆరా తీశారు. సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. రౌడీలు, అనుమానితులు, పాత నేరస్తుల వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి జీవన విధానం గురించి నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో స్థల వివాదాలు, కుటుంబ తగాదాలు, వర్గ విభేదాలు గురించి విచారించారు. సచివాలయ మహిళా పోలీసులు అంకితభావంతో సమర్థవంతంగా పని చేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితులను ఎస్‌హెచ్‌ఒకు తెలియజేయాలని సూచించారు. కుటుంబ తగాగదారలు, ఆస్థి వివాదాలను తొలిదశలో పరిష్కరిస్తే సగం నేరాలు తగ్గుతాయని అన్నారు. దత్తత గ్రామాలను వారానికి ఒకసారి సందర్శించాలని అన్నారు. పేకాట, కోడిపందాలు ఇతర అసాంఘిక కార్యకలాపాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. స్టేషన్‌లో నిర్వహించే వివిధ క్రైమ్ రికార్డులను, సిడి ఫైల్స్‌ను పరిశీలించారు. కేసుల పురోగతి ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బీట్ వ్యవస్థను మరింత పటిష్టం చెయాలని అన్నారు. రాత్రి వేళల్లో బీట్స్‌కు యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. రాత్రి గస్తీ పటిష్టంగా నిర్వహిస్తే నేరాలు నియంత్రించవచ్చని అన్నారు. ముఖ్యమైన ప్రదేశాలు, రహదారులపై తప్పని సరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. స్టేషన్‌ సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపరాఉ. పోలీసు సిబ్బంది శాఖాపరమైన సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు మీడియాకు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మహిళలు, మైనర్ బాలికలపై ఎవరైనా నేరాలకు పాల్పడినా, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన చట్టం నుండి తప్పించుకోకుండా తగిన శిక్ష పడేవిధంగా కోర్టు ట్రయిల్ మానిటరింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. తద్వారా గతంలో ఎన్నడూలేనివిధంగా కోర్టుల్లో ముద్దాయిలకు శిక్షలు పడుతున్నాయని అన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో చీరాల డిఎస్‌పి ఎస్ ప్రసాదరావు, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, కారంచేడు ఎస్‌ఐ జి శ్రీనివాసరావు, సిసి హరికృష్ణ పాల్గొన్నారు.