పోలీస్ స్టేషన్‌లో ఉపాధ్యాయులు ఉండాలనే
ఉత్తర్వులు రద్దు చేయాలి
ప్రజాశక్తి - బనగానపల్లె
గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల సమయంలో సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులు ఆయా మండలాల పోలీస్ స్టేషన్‌లో ఉండాలనే ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సత్య ప్రకాష్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎన్ ప్రతాప్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో గతేడాది పదవ తరగతి పరీక్షల సమయంలో సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయులను పరీక్షా సమయంలో వారు పని చేసే మండల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఉండాలని జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక తప్పుకు ఓకే శిక్ష ఉంటుందని, జీవితకాలం అదే నేరానికి పలు విధాల శిక్షలు, అవమానాలు గురయ్యే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ఉపాధ్యాయ లోకాన్నే అవమానపరచడమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయులకు 10వ తరగతి పరీక్ష విధులు కేటాయించలేదని, దూర ప్రాంతాలలో ఫోర్త్ కేటగిరిలో వారికి విధులను కేటాయించి తిరిగి పదవ తరగతి పరీక్షలు అయిపోయేంతవరకు స్టేషన్‌లో ఉండాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు బి.సుధాకర్, ఆర్థిక కార్యదర్శి ఎం విజరు కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










