ప్రజాశక్తి - శ్రీకాకుళం: స్పందన కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో జాప్యం ఉండరాదని ఎస్‌పి జి.ఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 40 వినతులు వచ్చాయి. కుటుంబ తగాదాలకు సంబంధించి మూడు, మోసాలకు సంబంధించి ఐదు, ఆస్తి తగాదాలకు సంబంధించి 12, పాత ఫిర్యాదులు ఎనిమిది, ఇతర కారణాలతో 12 వినతులు వచ్చాయి. వినతులను స్వీకరించిన ఎస్‌పి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెంటనే ఎస్‌పి కార్యాలయానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి పాల్గొన్నారు.