Jun 20,2023 01:49
విడోఫండ్‌ చెక్కులను అందజేస్తున్న జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గతంలో గుండెపోటుతో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వర్లు సతీమణి నాగలక్ష్మికి సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఫ్లాగ్‌ ఫండ్‌, విడో ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పోలీసు శాఖలో అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. అటువంటి వారి కుటుంబాలకు పోలీస్‌ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినా, ఏ సహాయం కావాలన్నా తక్షణం స్పందించి సాయమందించడానికి పోలీస్‌ శాఖ సంసిద్ధంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ త్వరితగతిన అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ బిసెక్షన్‌ సూపరింటెండెంట్‌ కె రాధిక పాల్గొన్నారు.