Jul 19,2023 00:04
'హోంగార్డ్స్‌ దర్బార్‌' నిర్వహిస్తున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలోని హోంగార్డుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా 'హోంగార్డ్స్‌ దర్బార్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. పోలీస్‌ శాఖకు హోంగార్డుల సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ క్యాంప్‌ కార్యాలయ సమావేశ హాలులో 'హోంగార్డ్స్‌ దర్బార్‌'' కార్యక్రమాన్ని నిర్వహించి, హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వృత్తిపరంగా వారికి వున్న సమస్యలను పరిష్కరించడానికి, వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు. జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల కోసం హోంగార్డ్స్‌ పోలీసులతో సమానంగా ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌, శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాలను ఆరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్నారు. హోంగార్డ్స్‌ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పండుగలు, విఐపిల పర్యటనలకు వచ్చే సందర్భాలలో పోలీస్‌ శాఖకు వారి సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ఇదే విధంగా హోంగార్డ్స్‌ తమ సేవల్ని చిత్తశుద్ధితో నిర్వహించి బాపట్ల జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తెస్తారని ఆశిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. విధులపరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 'దర్బార్‌' కార్యక్రమానికి హాజరైన హోంగార్డ్‌లు వారి సమస్యలను జిల్లా ఎస్పీకి తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డులు వ్యక్తపరచిన సమస్యలలో కొన్నిటిని తక్షణమే పరిష్కరిస్తామన్నారు. మిగిలిన సమస్యలను కూడా ఇతర శాఖల అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. హోంగార్డులకు వున్న వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించడానికి, వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఏఆర్‌ డిఎస్‌పి ఎండిహెచ్‌ ప్రేమ్‌కుమార్‌, నెల్లూరు జిల్లా హోంగార్డు ఏఆర్‌ డిఎస్‌పి చంద్రమోహన్‌, విజయవాడ హౌంగార్డు ఏఆర్‌ డిఎస్పి ఐ మోహన్‌బాబు, వెల్ఫేర్‌ ఆర్‌ఐ బి శ్రీకాంత్‌ నాయక్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ ఎల్‌ మన్మథరావు, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.