Jun 29,2023 00:18
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీసు అధికారులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నేరాల నియంత్రణకు, నేర పరిశోధనకు సీసీ కెమెరాలు పాత్ర కీలకమైందని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. బుధవారం జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు వాటి అవశ్యకత గురించి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1348 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పడక ముందు జిల్లాలో 562 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఏర్పడిన తరువాత గత సంవత్సరం జిల్లాలో 143 సీసీ కెమెరాలు, గడిచిన 6 నెలల కాలంలో 639 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా పోలీస్‌ అధికారులు వారి వారి పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలలోని ముఖ్యమైన కూడళ్ళు, రహదారుల పై ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా నేరం జరగకుండా ముందుగానే నియంత్రించడం కోసం, నేరం జరిగిన తర్వాత సంబంధిత నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్ళు, రద్దీ ప్రదేశాలలో నేరాలు జరగకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో సీసీ కెమెరా ఉండటం ఎంతో ఉపయోగమని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పరిశీలించడం వలన ముందస్తుగా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చనని జిల్లా ఎస్పీ తెలిపారు. తప్పని సరిగా జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.