దళిత హక్కుల కార్యకర్త నౌదీప్ కౌర్ ఫిబ్రవరి 26న కర్నాల్ (హర్యానా) జైలు నుండి విడుదలైంది. కార్మిక హక్కుల పోరాట సంస్థ 'మజ్దూర్ అధికార్ సంఘటన్' తో కలిసి పనిచేస్తున్న 23 ఏళ్ల నౌదీప్ ని సోనిపట్ పోలీసులు జనవరి 12న అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నంతో పాటు పలు నేరాలు మోపుతూ కుండ్లి పోలీస్ స్టేషన్‌లో ఆమె మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిర్బంధం లోకి తీసుకొన్న పోలీసులు ఆమెపై జరిపిన పైశాచిక దాడి, హింస, కంటి చూపు సరిగా లేని ఆమె సహ దళిత కార్యకర్త శివకుమార్ అరెస్ట్ గురించి-సామాజిక మాధ్యమాలలో బలంగా వినిపించడం మొదలైంది. ఆమె మీద ఆరోపించబడ్డ రెండు కేసుల్లో జిల్లా కోర్టులు ఫిబ్రవరిలో బెయిలు మంజూరు చేశాయి. ఆ తర్వాతే పంజాబ్ హర్యానా హైకోర్టు నౌదీప్ నిర్బంధాన్ని సుమోటోగా పరిశీలించి తుది కేసులో బెయిలు మంజూరు చేసింది. నౌదీప్ కౌర్ విడుదలైన మరునాడు స్వతంత్ర పత్రికా రచయిత మన్ దీప్ పునియా ఆమెను కలిసి...ఆమె కార్యాచరణ, అరెస్ట్, నిర్బంధంలో అనుభవించిన హింస తదితరాల గురించి చర్చించారు. ఆ వివరాలు క్లుప్తంగా....
- మిమ్మల్ని అరెస్ట్ చేసిన జనవరి 12న ఏం జరిగింది? మీ అరెస్టుకు దారితీసిన పరిణామాలను వివరించగలరా?
పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిల సాధన కోసం, కార్మికులకు అండగా సింఘు బోర్డర్ లోని కుండ్లి ఇండిస్టియల్ ఏరియాకి మేం జనవరి 12న వెళ్లాం. చాలా మంది కార్మికులు అక్కడ సమావేశమయ్యారు. మేం ఒక ఫ్యాక్టరీ దగ్గరకి చేరాం. ఒక గంటలో పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను చెల్లిస్తామని ఆ ఫ్యాక్టరీ యజమాని హామీ ఇచ్చాడు. సాయంత్రం లోపు చెల్లిస్తానని మరో యజమాని ప్రకటించాడు. ఏదైనా ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకొన్న తర్వాత ఆ ఫ్యాక్టరీ బయట ఓ అరగంట పాటు బైఠాయించి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శాంతియుతంగా నినాదాలివ్వడం మా కార్యక్రమం. ఆ సందర్భంలో ఒక ఫ్యాక్టరీ యజమాని గేట్లు మూసేశాడు. పోలీసులు రాగానే మహిళలను కొట్టడం మొదలెట్టారు. ఒక పోలీసు నా మెడ చుట్టూ చేయి బిగించి నన్ను బయటికి లాగివేయడానికి ప్రయత్నించాడు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. నన్ను అరెస్ట్ చేసి సోనిపట్ కి తీసుకెళ్ళారు. సోనిపట్ స్టేషన్ లో కొట్టి హింసించి ఆపైన కర్నాల్ జైలుకి తరలించారు.
- అరెస్ట్ చేసేప్పుడు పోలీస్ ప్రవర్తన ఎలా ఉంది? మిమ్మల్ని లాకప్‌లో కొట్టారా?
నన్ను అదుపు లోకి తీసుకొన్న క్షణం నుండి కర్నాల్ జైలుకి పంపేదాకా కొడుతూనే ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఎవరూ లేరు. మగ పోలీస్ నా జుట్టు పట్టుకొని పోలిస్ వ్యాన్ దాకా ఈడ్చుకెళ్ళాడు. ఆ పోలీస్ వాహనాన్ని కుండ్లి సరిహద్దుల్లో ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆపి నన్ను తీవ్రంగా కొట్టారు. అక్కడినుంచి కుండ్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆడ పోలీస్ కాకుండా మగ పోలీసులే నా మీద కూర్చొని హింసించారు. ఇతర కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించడానికి నా చేత బలవంతంగా కొన్ని డాక్యుమెంట్ల పైన సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. కుండ్లి పోలీసులు కులంపేరుతో దూషించారు. వేధించారు. రహస్యాంగాల మీద సైతం దాడి చేశారు.
- జైలులో ఉన్న 45 రోజులు మీ అనుభవాలేమిటి?
జైలులో నేను చాలామంది మహిళలతో మాట్లాడాను. కుండ్లి పోలీస్ నన్ను అరెస్ట్ చేసి దాడిచేశారని, వేధించారని చెప్పినప్పుడు... ఇలాంటిదంతా సాధారణ విషయమని వారికనిపించింది. పోలీస్ కస్టడిలో రేప్ చేయబడ్డ మహిళలను కలిశా. మగ పోలీసులతో ఘోరంగా పదిహేను రోజులదాకా హింసించబడ్డవాళ్లున్నారు. చేతులు విరిగినవాళ్లు కొందరు, కాళ్ళు విరిగినవాళ్లు కొందరు. ఇదంతా జరిగింది పోలీస్ కస్టడీ లోనే. ఈ విషయాలు మన పోలీస్ వ్యవస్థ ఆడవాళ్లని, షెడ్యూల్డ్ కులాల వారిని, దళితుల్ని ముఖ్యంగా దళిత మహిళల్ని ఎలా చూస్తుందో వివరించలేని భయంకర ప్రశ్నలే.
- పోలీస్ కస్టడీ (రక్షణ) లో జరుగుతున్న హింస, అత్యాచారాల గురించి ఎంతైనా చర్చించాల్సిన అవసరం వుందనుకుంటున్నారా?
దీన్ని నిలదీయాల్సిన అవసరముంది. ఇది నాకు ఒక్కదానికే జరిగిన దుర్మార్గం కాదు. పోలీస్ కస్టడీలో అత్యాచారానికి గురైన వాళ్లు, పోలీసుల చేత హీనంగా చూడబడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. దళిత మహిళలనైతే జైలు బయట కూడా వేధిస్తారు మన పోలీసులు. మహిళలైతే చాలు...కుల వర్గాల కతీతంగా హింసిస్తారు. పోలీసుల చూపు ఇలాగే ఉంటుంది. ఇకముందు ఇలా జరగకుండా ఉండడానికి ప్రజలు ముందుకొచ్చి, ఆ తరహా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని నిలదీయాలి. నాకు జరిగిన అలాంటి బాధాకర అనుభవం మొదటిదీ కాదు, చివరిదీ కాదు. ఎటువంటి చర్య ఈరోజు తీసుకోకపోతే మరెంతోమంది మహిళలకు ఇలాగే జరిగిపోతూనే వుంటుంది. ఈ సమస్య చాలా తీవ్రమైనది. చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది.
- మీరు ఏదైనా కార్మిక సంఘంతో కలిసి పనిజేస్తున్నారా? ఆ సంఘంలో ఎలా చేరారు?
సెప్టెంబర్ నెలలో ఇక్కడకొచ్చి ఒక ఫ్యాక్టరీలో పని చేయడం మొదలెట్టాను. 'మజ్దూర్ అధికార్ సంఘటన్' అనే కార్మిక సంఘం గత మూడేళ్లుగా పనిజేస్తోంది. నేను వారితో కలిసి పని చేయడం ప్రారంభించాను.
- కొనసాగుతున్న రైతు ఉద్యమంతో మీరెలా కనెక్ట్ అయ్యారు?
రైతుల డిమాండ్లు సహేతుకంగా వున్నందున మేము (మజ్దూర్ అధికార్ సంఘటన్) వారికి మద్దతిచ్చాం. రైతులు సింఘు బోర్డర్ దగ్గరకు చేరుకొన్నాక కార్మికులం పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి రైతులకు మద్దతుగా డిసెంబరు రెండున సమ్మెజేశాం. రెండు వేల మందికి పైగా కార్మికులం కుండ్లి ప్రాంతం నుండి సింఘు బోర్డర్ దాకా నినాదాలు చేస్తూ కవాతు నిర్వహించాం. సింఘు సరిహద్దు లోని వేదిక వరకు వెళ్లి అదే వేదిక మీద నుండి 'మజ్దూర్ అధికార్ సంఘటన్' ప్రతినిధిగా మాట్లాడాను. ఈ నల్ల చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితిని పెంచుతాయి. ఈ విధానం కార్మికుల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే మేం కార్మికులం రైతుల పోరాటానికి మద్దతిస్తాం. కార్పొరేట్ శక్తులు రైతుల నుండి కొనుగోలు చేస్తే శ్రామికులు మార్కెట్లో కొనుక్కోవాలి. బంగాళా దుంపల్ని కార్పొరేట్లు కేజీ 5 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలకు కేజీ 40-45 రూపాయలకు అమ్ముతారు. నిరంతర ధరల పెరుగుదల ప్రజలు నష్టపోవడానికి దారితీస్తుంది. కార్మికులుగా మేం దీన్ని అర్ధంచేసుకొన్నాం. అందుకే రైతులకు మద్దతునిచ్చాం. మద్దతును కొనసాగిస్తాం.
- మీ మీద డిసెంబర్ 28న ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. అంతకు ముందు నించీ మీరు వేతనాల సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తున్నారా?
అవును. కార్మికులకు అండగా నిలుస్తూ నిరంతరం వివిధ ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతుండేవాళ్లం. లాక్‌డౌన్ కాలానికి రావాల్సిన వేతనాలు ఇప్పటికీ బకాయి వున్నాయి. కార్మికులు ఈ వేతన బకాయిలను సామరస్యంగా సాధించుకోవడానికి మేం సాయపడేవాళ్లం. సుమారు 300 కార్మికులు దాదాపు రూ.5 లక్షల పెండింగ్ వేతనాలు సాధించడానికి తోడ్పడ్డాం. ఇదే మాదిరి వేతనాలు సాధించడానికి డిసెంబర్ 28న నూడుల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్లాము. అక్కడికి 'క్విక్ రెస్పాన్స్ టీమ్' వచ్చి కార్మికుల మీద దాడి చేయడమే కాకుండా ఒకసారి కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల ఉదంతంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లాం. కానీ మా ఎఫ్.ఐ.ఆర్ ని నమోదు చేసుకోలేదు. కాల్పుల ఘటనపై ఎఫ్.ఐ.ఆర్. ని నమోదు చేసుకోని విషయం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకి ఉత్తరం, మెయిల్ ద్వారా తెలియజేశాం. కానీ ఈరోజు వరకు వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఇలాగే, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ ఉండేవాళ్లం.
- ఈ 'క్విక్ రెస్పాన్స్ టీమ్' ఏమిటి? వాస్తవంలో వాళ్లు చేసే పనేమిటి?
కుండ్లి పారిశ్రామిక ప్రాంతంలో 'క్విక్ రెస్పాన్స్ టీమ్' అనే గుంపు ఉంది. ఆ ప్రాంతం లోని కార్మిక సంఘాలను ఈ గుంపు నియంత్రిస్తుంది. అందుకు ప్రతిఫలంగా ఫ్యాక్టరీ యజమానుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతుంది ఈ టీమ్. కార్మికులు తమ గొంతు పెంచకుండా చూడ్డం ఈ గుంపు పని. రాత్రులు పారిశ్రామిక ప్రాంతంలో నిఘా పనులు చేస్తూ వుంటారు. కాని కార్మికుల భద్రత కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటారు. నిజానికి కార్మిక సంఘ సభ్యులు ఆ ప్రాంతంలో కరపత్రాలు పంచడానికి వెళ్లినా, కార్మికులతో మాట్లాడడానికి ప్రయత్నించినా, ఏ హక్కునైనా డిమాండ్ చేయడానికి సన్నాహాలు చేసినా ఈ గూండాలు ముందుగానే కార్మికులపై దాడులు చేస్తారు.
- మీ సహ కార్యకర్త శివకుమార్ లాగే ఎంతోమంది రైతులు జైళ్లలో వున్నారు. మీరిప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు కదా, ఆ రైతుల కోసం మీరు గొంతెత్తుతారా?
తప్పకుండా! ఎందుకంటే మేమెవ్వరమూ ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయలేదు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరిధిలో నడుచుకొన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు ఏదైనా అంగీకారం కాకపోతే మీ నిరసన ప్రకటించవచ్చు. కార్మికుల, కర్షకుల, మహిళల పక్షాన ఎప్పుడూ మాట్లాడుతూనే వుంటాం.
* ద కారవాన్ సౌజన్యంత్యో /రమా సుందరి వాల్ నుంచి/










