Oct 26,2023 22:28

ప్రజాశక్తి-కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో పెద్దాపురం, కాకినాడ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన, ప్రాధాన్యత క్రమంలో నిర్వహించాల్సిన అంశాలపైన, మహిళా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పిపోయిన బాలికల విషయాల్లో త్వరితగతిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. బాధితులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, దర్యాప్తు అంశాలలో అలసత్వం ఉండకూడదని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్క అధికారీ బాధ్యతతో ఉద్యోగ నిర్వహణ చేయాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా గుర్తించిన బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేవ్‌ కేసుల్లో తప్పనిసరిగా ముద్దాయిలకు శిక్షలు పడేలా చర్యలు ఉండాలని ఎస్పి అధికారులకు సూచించారు. నిందితులకు శిక్ష, బాధితులకు న్యాయం జరగాలంటే నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాలు సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, స్పీడ్‌ కోర్ట్‌ ట్రయిల్స్‌ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు ఎస్‌పి దిశా నిర్ధేశం చేశారు.