Jan 27,2023 23:48

నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి గౌతమిశాలి, పాల్గొన్న పోలీసు అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
పోక్సో కేసులు, స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ గౌతమి శాలి జిల్లా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నెలవారి క్రైమ్‌ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 11న జరిగే లోక్‌ అదాలత్‌లో దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసుల తగ్గింపునకు కషి చేయాలని సూచించారు. రహదారి ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం మాత్రమే కాదని, ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కారణాలవల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అంగవైకల్యం, ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు ఇతరులపై ఆధార పడాల్సి వస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి భద్రత నియమాలు పాటించేలా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో లైటింగ్‌, వేగ నియంత్రణ సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ బి విజయభాస్కర్‌, డీఎస్పీలు బి సునీల్‌, పి శ్రీనివాసరావు, మల్ల మహేశ్వరరావు, సిఐలు మోహన్‌ రావు, చంద్రశేఖర్‌, లక్ష్మణమూర్తి, అప్పలనాయుడు, పలువురు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.