ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : వావి, వరుస మర్చి, అభమూ శుభం తెలియని కన్న కూతురితో పాటు, ఆమె స్నేహితురాలిపై కూడా అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి శుక్రవారం జిల్లా కోర్టు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పార్వతీపురం పట్టణం కొత్తవలసకు చెందిన రొంపిల్లి రామకృష్ణ గత ఏడాది జూలైలో తల్లిలేని నాలుగో తరగతి చదువుతున్న తన కుమార్తెపై ఆత్యాచారానికి పాల్పడడమే కాకుండా, వారంరోజుల తర్వాత ఆమెకు తోడుగా వచ్చిన స్నేహితురాలిపై కూడా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ప్రతిఘటించిన వీరిపై ఎవరికీ చెప్పొద్దని, చెబితే కొడతానని బెదిరించాడు. ఆ తర్వాత విషయం బయటకుపొక్కడంతో ఇరువురు బాలికలు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టంతో పాటు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులకు అప్పటి డిఎస్‌పి ఎ.సుభాష్ దర్యాప్తు అధికారిగా, దిశ సెల్ డిఎస్పీ ఎస్‌ఆర్ హర్షిత ట్రయల్ పర్యవేక్షణ నిర్వహించారు. వీరివురు కృషితో ఏడాది కాలంలో ముద్దాయికి శిక్ష వేయించగలిగారు. ముద్దాయిపై నేరం రుజువుకావడంతో శుక్రవారం పోక్సోకోర్టు జిల్లా జడ్జి షేక్‌సికిందర్‌బాషా ఒక్కో కేసులో ముద్దాయికి 20ఏళ్లు కఠిన కారాగారా శిక్ష, రూ.10వేలు జరిమాన విధించారు. బాధిత బాలికలు ఒక్కొక్కరికి రూ.4లక్షలు చొప్పున నష్టపరిహారం మంజూరు చేస్తూ తీర్పు అందించారు. ఈ కేసులో చొరవ చూపించిన పోలీస్ సిబ్బంది ఐ.వెంకటరమణ, కె.అప్పలరాజు, ఎం.హరికృష్ణ, రాధను ఎస్‌పి అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎఎస్పీ దిలీప్‌కుమార్, దిశా డిఎస్పీ హర్షితలత పాల్గొన్నారు.










