Dec 24,2022 23:31

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌

ప్రజాశక్తి-చింతూరు
దశాబ్దాలుగా పోడు భూముల సాగు చేస్తున్న గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారులు వేధింపులు ఆపాలని, ప్రభుత్వం తక్షణమే సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఎం చింతూరు మండల కార్యదర్శి సీసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఏడుగురాళ్లపల్లిలో పోడు భూముల సాగుదారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా హక్కు పత్రాలు లేకున్నా ఈ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. హక్కు పత్రాల కోసం అనేక పోరాటాల ఫలితంగా 2005 అటవీ హక్కుల చట్టం సాధించారని, కానీ నేటికీ సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఫారెస్ట్‌ అధికారులను ఉసిగొలుపుతుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులపై పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. అటవీ హక్కుల చట్టంను పటిష్టంగా అమలు పరచకుండా నూతన అటవీ విధానంతో అడవులను, ఖనిజ సంపదను సహజ వనరులను చట్ట విరుద్ధంగా కార్పొరేట్లకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్‌, మండల నాయకులు మల్లం సుబ్బమ్మ, వ్యాకరాజ్‌ కుమార్‌, సవలం ముత్తయ్య, సవలం దేశయ్య, కన్నారావు, చంద్రయ్య, కట్టం చుక్కమ్మ, కనితి, మారమ్మ సవలం, వెంకటేష్‌, సోలం, రాజులు సవలం, శ్రీను కనితి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.