Jan 02,2023 23:24

ప్రధాన రహదారి లో హెచ్చరిక బోర్డులు లేని కల్వర్టు గొయ్యలు

కల్వర్టుల నిర్మాణానికి
గోతులు తీసి వదిలేసిన కాంట్రాక్టర్‌
పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు
హెచ్చరిక బోర్డులైనా ఏర్పాటు చేయని వైనం
ఆందోళన చెందుతున్న వాహనదారులు
ప్రజాశక్తి -సీలేరు
: మండలంలోని ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న కల్వర్టుల వద్ద ప్రమాదం పొంచి ఉంది. కల్వర్టుల నిర్మాణాలను కోసం జెసిబిలతో పెద్ద గోతులు తవ్విన కాంట్రాక్టర్‌, వెంటనే పనులు చేయకుండా వదిలేయడం, కనీసం ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారముందని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత ఆర్‌అండ్‌బి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిసున్నారని వాపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలివి.
జీకే వీధి మండలం సీలేరు నుంచి దుప్పిలివాడ పంచాయతీ చల్లని శిల్ప వరకు గోతులమయమైన ప్రధాన రహదారి పునర్నిర్మాణంతోపాటు మధ్యలో 15 కల్వర్టుల నిర్మాణానికి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. పనులు మొదలెట్టిన సంబంధిత కాంట్రాక్టర్‌, కల్వర్టుల వద్ద జెసిబితో పెద్దగోతులు తవ్వి, పనులు మొదలెట్టి పూర్తిచేయకుండానే వదిలేశారు. కొన్నాళ్లుగా పనులు ప్రారంభించకపోగా, కల్వర్టు గోతుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. వీటిల్లో అనేక కల్వర్టులు రోడ్డు మలుపుల వద్ద ఉండడంతో ఏమాత్రం గతితప్పినా ప్రమాదానికి గురికావడం ఖాయమని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
ఇదే రహదారిలో విశాఖపట్నం, భద్రాచలానికి బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా నైట్‌ సర్వీసు బస్సులే ఎక్కువగా ఉండడంతోరాత్రి వేళ ప్రయాణంలో ఎక్కడ, ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కల్వర్టుల కోసం భారీ గోతులే తీసి వదిలేయడంతో ఏమాత్రం ప్రమాదం జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని అంటున్నారు. దీనిపై చింతపల్లి డివిజన్‌ ఆర్‌అండ్‌బి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడుతున్నారు.
ఈ మార్గం గుండా ఇరువైపులా మైదానం నుంచి ఏజెన్సీకి బస్సులు, ఇతర వాహనాలతోపాటు బైక్‌లు, ఆటోలు, జీపులు ఇతర వాహనాలు కూడా భారీ సంఖ్యలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని దారకొండ దుప్పిలివాడ, చల్లని శిల్ప సీలేరు ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్‌ అండ్‌ బి అధికారులు తక్షణ చర్యలు చేపట్టి కల్వర్టు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.అంతకుముందు నిర్మాణాలకు కల్వర్టుల నిర్మాణాలకు తీసిన గోతుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తక్షణమే హెచ్చరిక బోర్లులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు హెచ్చరికలు జారీచేసి, పనులు పున:ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.