ఘాట్‌రోడ్డు మలుపులో రోడ్డుకు అడ్డంగా కూలిన మామిడిచెట్టు మొదలు
తొలగింపులో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం
వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదాలకు ఆస్కారం
ప్రజాశక్తి -పెడబయలు రూరల్/ ముంచంగిపుట్టు: మండలంలోని కిలగాడ, చిప్పపుట్టు మధ్య్ద ఘాట్‌రోడ్డు మలుపులో కూలిన భారీ వృక్షం మొదలు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం భారీ వర్షాలకు భారీ మామిడిచెట్టు మొదలుకు కూలిపోయి, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడగా, సంబంధిత అధికారులు స్పందించి, కూలిన మామిడిచెట్టు కొమ్మలను కొంత వరకు రోడ్డుకు ఒకవైపున తొలగించి, వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. తర్వాత నడిరోడ్డులో మధ్య వరకు ఉన్న మిగిలిన భాగాన్ని తొలగించడంతో నిర్లక్ష్యం వల్ల నేటికీ అలానే పడి ఉంది. భారీ మలుపులో, అందులోనూ ఘాట్‌రోడ్డులో దగ్గరకు వచ్చేంతవరకు వాహనాల డ్రైవర్లకు కనబడని ప్రాంతంలో భారీ చెట్టుమొదలు నడి రోడ్డు మీద సగానికి పైగా ఉన్నా, దాన్ని తొలగించడంలో నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ మార్గంలో నిత్యం పాడేరు వైపు నుంచి అటు జోలాపుట్టు ఒడిషా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు రాకపోకలతో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు మోటారు సైకిళ్లు, ఏజెన్సీలో ప్రజలకు రాకపోకలకు తిరిగే ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల రద్దీ వేరే చెప్పనక్కర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు మలుపులో భారీగా ఉన్న చెట్టు మొదలు వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురికాక తప్పదు. అంతేకాక ఇక్కడ ఎదురురెదురుగా వాహనాలు వస్తే మళ్లిపోయేందుకు ఆస్కారం లేనంతంగా రోడ్డు కూడా ఇరుకుగానే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, ఏదైనా ప్రమాదం జరిగి, ఒకరిద్దరి ప్రాణాలు పోయేంత వరకు కాకుండా, అసలు ప్రమాదాలకు ఆస్కారం లేకుండానే ముందుగానే నడిరోడ్డుపై అడ్డంగా ఉన్న భారీ మామిడి చెట్టు మొదలును తొలగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం శీతాకాలంలో ఏజెన్సీలో ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతంగా కురుస్తున్న దట్టమైన పొగమంచు వల్ల దగ్గరకు వచ్చేవరకు ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించే వీలులేని పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










