Nov 08,2022 22:01

ప్రజాశక్తి - భీమడోలు
          మండలంలోని పొలసానిపల్లి గ్రామంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు బూసి వినీత మంగళవారం వేర్వేరుగా పర్యటించారు. ఎంఎల్‌సి తన పర్యటనలో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజుతో కలిసి పొలసానిపల్లి సర్పంచి షేక్‌ రహీమాబేగం హసేనాను కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో విద్యాపరంగా జరుగుతున్న అభివృద్ధిని సర్పంచి ఎంఎల్‌సికి వివరించారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు బూసి వినీత, రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ జె.రాజేంద్రప్రసాద్‌ పొలసానిపల్లిలోని బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను సందర్శించారు. వీరివెంట గురుకుల విద్యాసంస్థల జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ వాసవి, భీమడోలు సిఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ చావా సురేష్‌ ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేనా అధ్యక్షతన విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హక్కులు, చట్టపరంగా రక్షణ ఇతర అంశాలను వివరించారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో వివిధ విభాగాలను వారు సందర్శించారు. అక్కడ అమలవుతున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో గురుకులం ప్రధానోపాధ్యాయిని ఎం.పద్మావతి, ఎంపిటిసి అంబటి దేవి, నాగేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.