Sep 04,2023 17:37

ప్రజాశక్తి - భీమడోలు
    పొలసానిపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచిగా 11వ వార్డు సభ్యులు కోట శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి, దెందులూరు గ్రామపంచాయతీ విస్తరణ అధికారి ఎన్‌.తిరుపతి స్వామి తెలిపారు. ఈమేరకు ఎన్నికలను గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. నూతన గ్రామ ఉపసర్పంచిగా ఎన్నికైన కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు సహాయ సహకారాలు మరువలేనివన్నారు. గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గ్రామ సర్పంచి షేక్‌ రహీమాబేగం హసేన సేవలు అభినందనీయమన్నారు. ఎంపిటిసి సభ్యులు ఎ.దేవీ నాగేంద్ర ప్రసాద్‌ సలహాలు, సూచనలతో విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈయన పేరును 9వ వార్డు సభ్యులు పాకిరం శ్రీనివాసరావు ప్రతిపాదించగా, మూడో వార్డు సభ్యులు భీమడోలు రామకృష్ణ బలపరిచారు. ఎన్నికలకు గ్రామపంచాయతీ పరిధిలోని 12 మంది వార్డు సభ్యులకు గాను 10 మంది సభ్యులు హాజరయ్యారు. వీరందరూ ఏకగ్రీవంగా శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి తమ మద్దతు తెలిపారు. వైసిపి మద్దతుతో ఉప సర్పంచిగా ఎన్నికైన శ్రీనివాసరావు ఎంపికకు సహకరించిన వారందరికీ గ్రామ సర్పంచి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎంపికైన ఉప సర్పంచిను పలువురు అభినందించారు. ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని శిక్షణా ఉప కలెక్టర్‌ తిరుమాని పూజ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్‌.ఠాగుర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.