రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో ఎంఎల్‌ఎ వాసుబాబు
ప్రజాశక్తి - భీమడోలు
పొలసానిపల్లితోపాటు సమీప గ్రామాలకు నిరంతరం శుద్ధి చేసిన గోదావరి జలాలను తాగునీటిగా అందించేందుకు పొలసానిపల్లి పంచాయతీ పాలకవర్గం కృషి అభినందనీయమని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు అన్నారు. గ్రామ సర్పంచి షేక్ రహీమా బేగంహసేన ఆధ్వర్యంలో గ్రామస్తుల చిరకాల కోరిక మేరకు శుద్ధి చేసిన గోదావరి జలాలను తాగునీటిగా నిరంతరం అందజేసేందుకు పదివేల లీటర్ల సామర్థ్యం గల గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్‌ను రూ.ఐదు లక్షలు పంచాయతీ నిధులతో నిర్మించారు. దీన్ని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు శనివారం ప్రారంభించారు. తొలి నీటి బిందెను సర్పంచితో కలిసి గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు సర్పంచి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆర్‌అండ్‌బి రోడ్డు విస్తరణ సందర్భంగా పాడైపోయిన పైపులైన్ వ్యవస్థను రూ.20 లక్షలు జలజీవన్ మిషన్ నిధులతో పునర్‌నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కారం చేశామన్నారు. సర్పంచి విజ్ఞప్తి మేరకు రూ.పది లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. వీటితో పైప్‌లైన్ల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ క్రమబద్ధీకరణకు కల్వర్టుల నిర్మాణం జరిగాయన్నారు. ఆంజనేయనగరం ఆవాస ప్రాంతానికి మంజూరైన రూ.15 లక్షలు నిధులతో అక్కడ గోదావరి జలాలను తాగునీటిగా అందించేందుకు గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్, పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉపాధి హామీ నిధులతో ఒక సాగునీటి చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి అంబటి దేవి నాగేంద్రప్రసాద్, భీమడోలు సొసైటీ అధ్యక్షులు రాయపాటి సత్య శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు షేక్ హసేన, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.ఠాగూర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










