May 16,2023 23:38

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : చక్కని ఆరోగ్యానికి, ఆకుకూరలు ఎంతో మేలని అందరికీ తెలిసిందే. అయితే వాటిని పండించే రైతుల బాధలు అంతా ఇంతా కావు. ఏ పంటలకు ఉండనంత కౌలు ఆకుకూరలు సేద్యానికి ఉంటుంది. అన్ని కాలాలు అనుకూలిస్తే, ఆకుకూర రైతులకు లాభాలే.. లేదంటే అప్పుల ఊబిలో కూరుకు పోవాల్సిందే. వేసవి భానుడి ప్రతాపం రోజు రోజుకి నిప్పుల కొలిమిలా మారుతోంది.
మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలతో ప్రతాపం చూపిస్తుంటే మరోవైపు పచ్చని పైర్లన్నీ సూర్య తాపానికి మాడిపోతున్నాయి. తాడేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వాణిజ్య పంటలతో పాటు, ఆకుకూరలు అధికంగా సాగవుతున్నాయి. కుంచనపల్లిలో 300 మందికి పైగా రైతులు ఆకుకూరలు పండిస్తున్నారు. వీటిని ఆకుకూరలు మార్కెట్‌కు వేసి, వచ్చిన ఆదాయంపైనే ఆయా రైతు కుటుంబాలు జీవిస్తుంటాయి. నిత్యం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌, నగరంలోని వివిధ రైతు బజార్లలో ఆకుకూరలు అమ్ముతుంటారు. సీజన్‌, అన్‌సీజన్‌తో సంబంధం లేకుండా ఆకుకూరలు పండించి, అమ్ముతుంటారు. వాణిజ్య పంటలైన పసుపు, అరటి, కంద, చేమ, తదితర పంటల కంటే మూడు రెట్లు అధికంగా ఆకుకూరల పంటల కౌలుంటుంది. ఒక్కో ఎకరానికి రూ.లక్ష నుండి రూ.లక్షన్నర వరకూ కౌలు చెల్లిస్తున్నారు. వాతావరణం అనుకూలించి, సారవంతమైన నేల అయితే ఆకుకూరలు దిగుబడి బాగానే ఉంటుంది. లేదంటే అకాల వర్షాలు, వేసవికాలం ఎండవేడికి ఆకుకూరలు దెబ్బతింటాయి. దీంతో ఆకుకూర రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇటీవల నిప్పుల్లా కాస్తున్న ఎండలతో ఆకుకూరలు మాడిపోతున్నాయి. రూ.లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.