Sep 25,2023 20:35

పొలంబడి (పాతచిత్రం)

పొలంబడి...తడబడి..!

పంట దిగుబడులూ అంతంతమాత్రమే
యాజమాన్యంపై రైతుల్లో కొరవడ్డ అవగాహన
రసాయనాల వాడకంతో నిస్సారమౌతున్న భూములు
వ్యవసాయంలో చీడ, పీడలను అరికట్టుటకు ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగి, భూసారం క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా నాణ్యతలేని అంతంతమాత్రపు దిగుబడులు వస్తుండటంతో పాటు రైతులు అపారంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి, రైతుల్లో సమగ్ర పంటల యాజమాన్య పద్దతులపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న పొలంబడులు ఏడా కానరాని పరిస్థితి. పొలం బడులు నిర్వహించి తద్వారా రసాయన పద్దతులకు క్రమంగా స్వస్తి పలికి, రైతుల్లో పకృతి సేద్యంపై మక్కువ పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
ఓ రైతు పొలంలో 30 మంది రైతులను సమావేశ పరిచి, పంటల్లోని వివిధ మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి, వారు ఆ పరిశీలనలపై చర్చించి, సమగ్ర పంటల యాజమాన్యాన్ని అమలు పరుస్తూ, ఆర్థికంగా తగు లాభదాయకమైన నిర్ణయాలను తీసుకుని 'శాస్త్రీయమైన సేంద్రీయ వ్యవసాయం' దిశగా ముందుకు తీసుకెళ్లి తద్వారా రైతు సాధికారతను సాధించడమే పొలంబడి ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం దానికి డాక్టర్‌ వైఎస్సార్‌ పొలంబడిగా పేరు మార్చి రైతుల్లో సమగ్ర పంటల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తోంది. అయితే ఆర్భాటం జాస్తి..ఆచరణ నాస్తి అన్న తరహాలో వ్యవసాయ శాఖ పొలం బడులు నిర్వహిస్తుందే తప్ప, చిత్తశుద్ధి ఏమాత్రం కనబర్చడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
నిస్సారమవుతున్న భూములు:
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నారు.సుమారు 3 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములున్నాయి. జిల్లాలో ఎర్ర రేగడి నేలలే అధికం. ఆ తర్వాత నల్లరేగడి, బంకమన్ను నేలలు ఉన్నాయి. అయితే జిల్లాలోని నేలల్లో అధిక భాగం నేలల్లో నత్రజని, భాస్వరం, ఫొటాషియం, జింక్‌, ఇనుము, సూక్షధాతువుల లోపాలున్నట్లు నిపుణులు గుర్తించారు. అధికంగా యూరియా వాడకం, చీడ పీడల నివారణకు కృత్రిమ రసాయనాల వాడకం మూలానా భూముల్లో సారం క్రమంగా తగ్గిపోతోందని కూడా నిపుణులు చెబుతున్న మాట. వరి, వేరుశెనగ, జొన్నలు, రాగి, సజ్జలు, మొక్కజొన్న, చెరుకు పంటలను రైతులు అధికశాతం పండిస్తుంటారు. అయితే చీడపీడల నివారణకు మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల నేలల్లో సారవంతం తగ్గి దిగుబడులు కూడా క్షీణిస్తున్నాయి. గతంలో ఒక ఎకరాకు 60 బస్తాల వరి ధాన్యాన్ని పండించి ఉత్తమ రైతు అవార్డులు అందుకున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి అవార్డులు అందుకుంటున్న వారు అరుదుగా కనపిస్తున్న పరస్థితి. ఎకరాకు 60 బస్తాల మాట అటుంచి నికరంగా 30 బస్తాలు పండినా గొప్పేనని రైతులు భావించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
కానరాని పొలంబడులు
సాధారణంగా పొలం బడి 14 వారాలు అనగా, పంటకాలం పాటు సాగుతుంది. వ్యవసాయ సమగ్ర పంటల సాగు పద్దతులలో నిష్ణాతులైన వ్యవసాయ శిక్షకులు లేకుంటే అధికారులు పొలంబడిలో అధ్యాపకులు గా వ్యవహరిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికరాదాయం, నాణ్యమైన దిగుబడి పొందడం ఎలాగో రైతులకు నేర్పించాల్సి ఉంటుంది. సహజ సిద్ధమైన వనరులతో సాగు చేయుట, భూసార పరీక్షను బట్టి ఎరువులు వాడుట, వానపాములు, సేంద్రీయ ఎరువుల తయారీపై కూడా రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువులు తగ్గించుట, విత్తనశుద్ధితో చీడపీడలను నివారించుట, అంతర పంటల ద్వారా మిత్ర పురుగుల వద్ధి చేయడలాంటి కార్యక్రమాలు కూడా పొలం బడి ద్వారానే రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా కనిపించాల్సిన పొలంబడులు అరుదుగా కూడా కనిపించడం లేదు. కొంతమంది కింది స్థాయి వ్యవసాయ సిబ్బందికి పొలంబడులంటే ఏంటో కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు.
నవంబర్‌ నుంచి : రమేష్‌, ఏడీఏ, శ్రీకాళహస్తి
ఈ ఏడాది నవంబర్‌ నుంచి శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ వ్యవసాయశాఖా క్షేత్రంలో పొలం బడులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పరిస్థితుల దృష్ట్యా గతంలో లాగా పొలంబడులు నిర్వహించని మాట వాస్తవం. సేంద్రియ సేద్యంపై వ్యవసాయ శాఖ తనవంతు కృషి చేస్తోంది. గతంలో దానికంటూ ఓ యంత్రాంగం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సమగ్ర పంటల యాజమాన్యంపై రైతుల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు పొలం బడులను, రైతులను గుర్తిస్తున్నాం.
సేంద్రియమంటే చిన్నచూపు: నాగరాజు, మాజీ ఆదర్శ రైతు
రైతు పక్షపాతి ప్రభుత్వమంటూ పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్పా, రైతులకు ఒరగబెట్టేదేమీ లేదు. గతంలో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీ ఓ ఉద్యమంలా సాగింది. ఆదర్శ రైతులు ఆ బాధ్యతను భుజాన మోశారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయమందకున్నా ఎరువులు, పిచికారీ మందులు తయారీ చేసి రైతులకు విక్రయించాం. చివరకు పాలకులు ఏకంగా ఆదర్శ రైతుల వ్యవస్థనే తొలగించింది.
పొలంబడి (పాతచిత్రం)