ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : పొట్ట దశలో ఉన్న వరిపైరుకు నీరు లేక నేల బీటలు వారగా... మిర్చి పైరును కాపాడుకోవడానికి 3 వేల అడుగుల దూరం నుండి పైపులతో నీరు పెట్టుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. అయినా పంట చేతికి దక్కే సూచనలు లేక తల్లడిల్లుతున్నారు. సిపిఎం చేపట్టిన పోరుయాత్ర కార్యక్రమంలో మండలంలోని కందులవారిపాలెంలో గురువారం పర్యటించింది. బగ్గి వెంకయ్య, పసుపులేటి మల్లారెడ్డి తదితరులకు చెందిన దెబ్బతిన్న పైర్లను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ పైర్లు ఎండిపోతున్నా, రైతులు నానా అగచాట్లు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంకయ్యకు చెందిన రెండెకరాలు, మల్లారెడ్డికి చెందిన 8 ఎకరాలు వరిపంట నీరు లేక పొట్ట దశలో పూర్తిగా ఎండిపోయిందని చెప్పారు. ఇప్పటికే ఆ రైతులు ఎకరాలకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారని, వ్యవసాయ శాఖాధికారులు ఈ పొలాలను చూసి వెళ్లినా నష్టపరిమారం మాత్రం ప్రకటించలేదని అన్నారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించి బాధిత రైతులను ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిగతా పైర్లను కాపాడుకోవడానికి రైతులు నీరు పెట్టుకోవడానికి చేస్తున్న ఖర్చునూ ఇవ్వాలన్నారు. మిర్చి పంటను కాపాడుకునేందుకు మూడువేల అడుగుల దూరం నుండి పైపులు వేసి నీటిని పెట్టుకుంటున్నారని, పైపులకు, కూలీలకు కలిపి సుమారు రూ.30 వేలు ఖర్చవుతోందని తెలిపారు.
జగనన్న భూరక్షలో భూ సమస్యలను ఏవీ పరిష్కారం చేయడం లేదని, కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలను మార్పు చేసి సిఎం బొమ్మలతో కొత్తవాటినే ఇస్తున్నారని అన్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని రకాల భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగనన్న జల పథకం కింద ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పినా వాస్తవంలో మాత్రం రైతులే స్వయంగా ఖర్చు పెట్టి బోర్లు వేయించుకోవడం, బావులు తీసుకోవడం జరుగుతోందని, కనీసం ఆ ఖర్చులనైనా రైతులకు ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఆసరా పథకం కింద తమకింకా డబ్బులు జమ చేయలేదని పలువురు మహిళలు పోరుయాత్ర బృందానికి వివరించారు.
సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 98 హామీలను అమలు చేశామని చెబుతున్నా వాస్తవానికి 60 శాతానికి కూడా మించలేదని, సాంకేతిక సమస్య సాకుతో సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నారని విమర్శించారు. నీరు లేక రైతులు, పనుల్లేక కూలీలు అల్లాడుతున్నారని, ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జనంపై విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించని కారణంగా మురుగు కూపాలుగా దర్శనమిస్తున్నాయని, సబ్‌ప్లాన్ నిధులు ఎమయ్యాయో అర్థం కావడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో నాయకులు సిహెచ్.లక్ష్మీనారాయణ, ఆర్.పూర్ణచంద్రరావు, వి.తులసీరామ్, బి.రామారావు, డి.మేరమ్మ, జై భగత్, వెంకటేశ్వర్లు, ఎం.శివరాం, సత్యవతి, అనూష, సుజాత, అమూల్య, కె.సాయికుమార్ పాల్గొన్నారు.










