Feb 02,2023 00:08

జలపాతాన్ని పున:ప్రారంభిస్తున్న ఎస్‌ఐ సత్తిబాబు, ఎంపిటిసి నాగేశ్వరరావు

ప్రజాశక్తి- మోతుగూడెం
చింతూరు డివిజన్‌ పరిధిలోని మోతుగూడెం పంచాయతీ పొల్లూరు జలపాతం సందర్శనకు అనుమతి ఇచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జలపాతం అభివృద్ధికి డిఎఫ్‌ఒ వాకపల్లి సాయిబాబా ఆదేశాల మేరకు ఐదు రోజులుగా పర్యాటలకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. బుదవారం నుండి జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతి ఇచ్చారు. ఐదుగురు వన సంరక్షణ సమితి సిబ్బందిని నియమించారు. జలపాతం వద్ద చుట్టూ పరిసరాలలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా సిబ్బందితో శుభ్రం చేయించనున్నారు. జలపాతానికి 50 మీటర్లు ఇవతల ఏర్పాటు చేసిన చెక్‌ పొస్ట్‌ను బుధవారం మోతుగూడెం ఎస్‌ఐ వాసంశెట్టి సత్తిబాబు, ఎంపిటీసి వేగి నాగేశ్వరరావు ప్రారంభించారు. పర్యాటకుల వద్ద కొంత రుసుము వసూలు చేసి సిబ్బందికి జీతాలు, మిగిలిన ఆదాయంతో పర్యాటకులకు ముఖ్యంగా స్త్రీలకు దుస్తులు మార్చుకోవడానికి వెదురుతో రెండు, మూడు గదులు, పర్యాటకులకు భోజనాలు చేయడానికి అనువుగా తగు ఏర్పాట్లు చేపడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కవరం ఇన్‌ఛార్జి ఎఫ్‌ఆర్‌ఒ కొండలరావు, డిఆర్‌ఒ సత్యనారాయణ రాజు, ఎఫ్‌బిఒ వెంకట్‌, అటవీ అధికారులు, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.