పొలిటికల్ సైన్స్‌తో ఉపాధి అవకాశాలు
విభాగాధిపతి ఆచార్య బివి మురళీధర్
ప్రజాశక్తి - క్యాంపస్
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ పీజీ సెట్ 2023 లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అర్థశాస్త్రంలో ఉన్నతమైన అవకాశాలు ఉంటాయని విభాగాధిపతి ఆచార్య బివి. మురళీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ పీజీ సెట్ 2023 లో పొలిటికల్ సైన్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్ని రకాల సదుపాయాలతో పాటు ఉన్నతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. ఎస్వియూలోని పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విద్యార్థులకు రెగ్యులర్ కోర్సులో 40 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో ఆరు సీట్లు ఉంటాయన్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతి గదులు, డిజిటల్ తరగతి గదుల సౌకర్యముతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన గ్రంథాలయంలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ప్రత్యేకమైన అర కలిగిన పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించే యుజిసి నెట్, రాష్ట్రస్థాయిలోనే స్లేట్, సివిల్ సర్వీస్ పరీక్షలు ఐఆర్‌ఎస్ వంటి సంస్థలలోని వివిధ ఉద్యోగాలకు పొలిటికల్ సైన్స్ ప్రామాణికం అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్ లలో కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, సచివాలయం ఉద్యోగాలు, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలలో పొలిటికల్ సైన్స్ ప్రధాన భాగంగా ఉంటుందని వివరించారు. పొలిటికల్ సైన్స్ లో పీజీ కోర్సు చేసిన తర్వాత విద్యార్థులకు పీజీ, డిగ్రీ, ఇంటర్, న్యాయవిద్య కళాశాలలో పొలిటికల్ సైన్స్ బోధించడానికి మంచి అవకాశాలుంటాయన్నారు. విదేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆర్థిక శాస్త్రం పీజీ చేసిన విద్యార్థులకు ఎన్నో ఉన్నతమైన అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ప్రతి సెమిస్టర్ లోనూ విద్యార్థులకు అవగాహన తరగతులతో పాటు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బ్యాంకింగ్ రంగంలో, పొలిటికల్ సైన్స్ రంగంలో నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధకులు, రచయితలచే ప్రత్యేకమైన తరగతులు, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబులతో పాటు వివిధ కోచింగ్ సెంటర్లు అందించే మెటీరియల్ కు సంబంధించి అంశాల పైన విశ్లేషణ, చర్చలు విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. ఎస్వీయులోని పొలిటికల్ సైన్స్ కోర్స్ లో పీజీ కోర్సు చేసిన విద్యార్థులకు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపాధి అవకాశాలు ఉన్నాయని సూచించారు.










