విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు పొలికేక వేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇటీవల ట్రూ అప్ ఛార్జీల పేరిట ఐదు రకాల వడ్డింపులను వసూలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై సిపిఎం, సిపిఐ, టిడిపి సంయుక్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. సిపిఎం, సిపిఐ నాయకత్వాలు సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుకుని విద్యుత్ భవన్ ఎదుట నిరసనలు, రౌండ్‌టేబుల్ కార్యక్రమాలు వరకు నిరసనల పరంపర కొనసాగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర పాలకుల్లో చలనం కనిపించడం లేదు. దశాబ్ద కాలం కిందట వినియోగించిన విద్యుత్ యూనిట్లకు ట్రూ అప్ ఛార్జీల పేరిట ఐదు రకాలుగా అదనపు భారాలను మోపడం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజాభిప్రాయం తీసుకున్నామనే పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. దశాబ్దాల కిందట యూ నిట్లకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తుండడం అటుంచితే ఇళ్లలో అద్దెలకు ఉన్న వారి సంగతి ఆందోళన కలిగివస్తోంది. ఎవరో వాడిన విద్యుత్ యూనిట్లకు ప్రస్తుతం ఉన్న వారు ఛార్జీలు చెల్లించాల్సి రావడవేమిటనే వాదన వినిపిస్తోంది. దీనికి రెండు రకాల కేటగిరీల పేరుతో సమానంగా వసూళ్లు చేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతుండడం సమజసంగా లేదనే విమర్శవినిపిస్తోంది. దశాబ్దం కిందట ఎవరో ఇష్టానుసారంగా వాడిని విద్యుత్ యూనిట్లకు ఇప్పుడు అద్దెకు దిగిన కుటుంబాలు చెల్లించాల్సి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కమర్షియల్ సర్వీసులకు ముందస్తు అడ్వాన్స్ పేరుతో భారీ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ముందస్తు అడ్వాన్స్‌లు చెల్లించడమేమిటి, అనంతరం వచ్చే బిల్లుల్లో తగ్గించు కోవడమేమిటనే వాదన వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మేలో డొమిస్టిక్, వ్యవసాయ, కమర్షియల్, ఇండ్రస్టియల్ సర్వీసుల నుంచి 13.57 కోట్లు యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. కమర్షియల్, ఇండిస్టియల్ సర్వీసుల నుంచి ఇటువంటి భారాల్ని పూడ్చుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వాలే ఇటువంటి భారాలను భరించడం సమంజసంగా ఉంటుందని చెప్పకోవచ్చు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటికే విద్యుత్ పోరాటాలది ప్రత్యేక స్థానం. ఇటువంటి పరిస్థితుల్లో ఎపి విద్యుత్ రెగ్యులేటరీ మండలి ఇటువంటి అదనపుఏ భారాల్ని మెగా ఇండిస్టియల్ సర్వీసులు నుంచి లేదా, ప్రభుత్వాల బొక్కసం నుంచి రాబట్టుకో వడం కొంతవరకు సమంజసంగా ఉంటుందేమో ఆలో చించుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలపై భారాలను ఇంతలంతలుగా భారాలు మోపడం క్షంతవ్యం కాదు. బిపి ఎల్ కేటగిరీలోని వారిపై విద్యుత్ భారాల్ని మో పడం ద్వారా సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం మినహా ఎటువంటి ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇటువంటి ట్రూ అప్ ఛార్జీల పేరుతో కూడిన అదనపు వడ్డింపుల కారణంగా రాజకీయ నష్టం మినహా మరే ఉపయోగం ఉండదనే సత్యాన్ని గ్రహించాల్సి ఉందనడంలో సందేహం లేదు.
- ప్రజాశక్తి- కడప ప్రతినిధి










