
ప్రజాశక్తి గోరంట్ల రూరల్ : ఉమ్మడి బోరు బావి నుంచి చేనుకు సాగునీరు వదులుకునే విషయంలో జరిగిన ఘర్షణలో ఓ రైతు మరో రైతు తలపై కొడవలితో నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధిత రైతు ఆసుపత్రిలో చేరాడు. మండలంలోని కొలిమిపల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబందించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు...
గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు కలసి ఉమ్మడిగా బోరు బావి తవ్వించుకున్నారు. ఆ ఆరుగురు రైతులు ఈ బోరు బావితో వచ్చే నీటితోఉన్న కొంత మేర భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కేశవ అనే రైతు గురువారం రాత్రి తన వరి పంటకు బోరుబావి నుంచి నీరు వదులుకున్నాడు. కొంతమేర తడి మిగిలిపోయింది. అయితే వంతు మేరకు శుక్రవారం ఉదయం చండ్రాయుడు అనే రైతు తన వరి పొలానికి బోరుబావి నుంచి వచ్చే నీటిని వదులుకున్నాడు. ఆసమయంలో కేశవ అక్కడికి చేరుకుని కొంతమేర తన పొలంలో కొంతమేర నీరు కట్టుకోవాల్సి ఉందని, కట్టుకుంటానని చండ్రాయుడిని అడిగాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఆగ్రహించి ఇంటికి వెళ్లిపోయిన కేశవ వేటకొడవలి చేతిలో పట్టుకుని వచ్చి ఒక్కసారిగా చండ్రాయుడు తలపై నరికాడు. దీంతో చండ్రాయుడు తల లోపలి వరకు తెగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమత్తం గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.