ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని, పొలాలను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట సాగు చేయాలని రైతులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ సూచించారు. నాదెండ్ల మండలం సాతులూరు, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, ములకలూరు గ్రామాల్లో పొలాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. సాతులూరులో పత్తిపైరులో అంతర పంటగా కంది సాగుపై అభినందించారు. అనంతరం జొన్నలగడ్డ రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ-క్రాప్ నమోదు, ఇకెవైసి పారదర్శకంగా జరగాలన్నారు. మినుము, పెసర, కంది విత్తనాలను 80 శాతం రాయితీపై, రబీలో పండించేందుకు అనుకూలమైన శనగ పంట విత్తనాలను 40 శాతం రాయితీపై పంపిణీ కోసం రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం ములకలూరు రైతులకు రాయితీపై మినుము, పెసర, కంది, శనగ విత్తనాలను అందజేశారు.
ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళి
ఎంఎస్ స్వామినాథన్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లోని డాక్టర్ బి.ఆర్ స్పందన సమావేశ మందిరంలో స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ స్వామినాథన్ కుటుంబ సభ్యులందరూ డాక్టర్లయినా ఆయన మాత్రం దేశం కోసం వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యారని, హరిత విప్లవంతో దేశంలో ఆహార కొరతను తీర్చారని చెప్పారు.
ప్రతిభావంతురాలైన పేద విద్యార్థినికి సాయం
బెల్లంకొండ మండలం రేమిడిచర్లకు చెందిన పేద విద్యార్థిని భూక్య శిలారాణి బారు బీఫార్మసీలో టాపర్‌గా నిలిచి జి.ప్యాట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీలో సీటు పొందారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ఉన్నత చదువుల్లో ప్రోత్సహించడానికి కలెక్టర్ చొరవ చూపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపు నుంచి రూ.70 వేల సాయాన్ని సమకూర్చి సోమవారం కలెక్టరేట్‌లో అందించారు. ఆయా కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, డిఆర్‌ఒ కె.వినాయకం, డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ.మురళి, జొన్నలగడ్డ సర్పంచ్ కె.చిన్న, ఎంపిటిసి ఐ.సానియా, ఏపీ సీడ్స్ మేనేజర్ సుబ్బయ్య, సహాయ వ్యవసాయ సంచాలకులు పి.మస్తానమ్మ, శివకుమారి, ఏవోలు నరేంద్రబాబు, హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు ఫిలిప్, బ్రహ్మయ్య, డిఇఒ కె.శామ్యూల్, పాల్గొన్నారు.










