ప్రజాశక్తి-భట్టిప్రోలు: అకాల వర్షం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో మాగాణి భూముల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట నీటిలో నానుతూ దెబ్బతింటున్నాయి. వరి కోతల సమయంలో కురిసిన వర్షానికి ఓదెలు తడిసి గింజ రంగుమారి దెబ్బతినగా రబీలో సాగుచేసిన మొక్కజొన్నతోనైనా అప్పుల బారి నుంచి బయట పడవచ్చనుకున్న తమకు అకాల వర్షంతో రబీ పంట కూడా సక్రమంగా చేతికందే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ఆదివారం కూడా తెల్లవారుజామున కురిసిన వర్షంతో నీటిపై నీరు పడటంతో ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేని రైతు ఆయిల్ ఇంజన్‌ల ద్వారా నీటిని బయటకు పంపే పనిలో నిమగమయ్యారు. కళ్లముందే వర్షపునీటితో పైరు ఎండిపోతుంటే అన్నదాత తల్లడిల్లుతున్నాడు. ఇదిలాఉండగా సాయంత్రానికి మరోమారు ఆకాశం మేఘావృతం కావటం గుండెల్లో గుబులు రేపుతోందని ఆందోళన చెందుతున్నారు. అంతేకాక డెల్టా ప్రాంతంలో అరకొరగా సాగు చేసిన మినుము, పెసర కొంత భాగం ఓదెలు దశలో ఉండగా మరికొంత పీకటానికి సిద్ధంగా ఉంది. వర్షాలకు తడిసిన ఓదెలు బూజుపట్టి గింజ కాయలోనే మొలక వస్తుందని, పీకటానికి సిద్ధంగా ఉన్న పైరు వర్షానికి తడవటంతో ఎండలు రాగానే కాయలు రాలిపోవడం లేదా పగిలిపోవటం జరుగుతోందని, దీని వల్ల అపరాలు సాగు చేసిన రైతు కూడా నష్టపోక తప్పటం లేదని ఆవేదన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
పర్చూరు: అకాల వర్షాలతో రైతులు కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఆరుబయట పందిళ్లలో ఉన్న పొగాకును, కల్లాల్లో ఉన్న మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తమ శక్తి యుక్తుల్ను ధారపోస్తున్నారు. పంట చేతికి అందే సమయంలో అనుకోని అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న జల్లులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి రైతులు కుప్పలు వేశారు. ఆరబెట్టిన మిర్చిపై కప్పిన పట్టలపైకి నీరు రావటంతో కొన్నిచోట్ల మిర్చి తడిసిపోయింది. రంగు మారి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ మిర్చి చేలల్లో నీళ్లు నిలవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.










