Mar 18,2023 00:42
మిర్చి పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపుతున్న రైతు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: అకాల వర్షం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గురువారం ఆకాశం మేఘావృతమై కారు మబ్బులు కమ్మేయటంతో కల్లాల్లో ఉన్న మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు పరదాల కోసం పరుగులు తీశారు. దీంతో పరదాలకు బాగా డిమాండ్‌ పెరిగింది. అన్నదాతల అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యాపారులు అధిక ధరలకు పరదాలు విక్రయిస్తున్నారు. అర్ధరాత్రి ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో అర్ధరాత్రి కల్లాల్లోకి అన్నదాతలు పరుగులు తీశారు. పరదాలతో కాయలు తడవకుండా భద్రం చేశారు. ఇంకొల్లు, హనుమోజిపాలెం, జరుబులవారిపాలెం గ్రామాల్లో పొగాకు ఎక్కువగా రైతులు సాగు చేశారు. ఈ పాటికే పొగాకు ఆకులు దండేలకు ఆరబెట్టే పనిలో ఉన్నారు. ఆరిన ఆకు ఎక్కడ వర్షానికి తడిసిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం కూడా వర్షం దంచి కొట్టింది. మిరప పొలాల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బంది పడ్డారు. నిలిచిన నీటిని బయటకు పంపించే పనిలో నిమగమయ్యారు.
పర్చూరు: అకాల వర్షం రైతులకు అపార నష్టం కలిగించింది. పంటలు చేతికివచ్చే సమయంలో ఊహించని విధంగా కురిసిన వర్షాలతో పంటలు మట్టిపాలవుతు న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వేకువ జామున నుంచి ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షానికి రైతులు హైరానా పడుతున్నారు. పొలాల్లోని కల్లాల్లో ఆరబెట్టిన మిరప పంట తడిసిపోకుండా పరదాలు కప్పుతున్నారు. ఆరుబయట పొగాకు తాళ్ళలో ఎండినవి తడిసిపోకుండా కొంతమేర జాగ్రత్త పడ్డారు. ఎక్కువ శాతం ఎండకపోవటం, ఒకేసారి వాటన్నింటినీ తీసుకువచ్చే అవకాశం లేకపోవటంతో కట్టిన పందిళ్లు కూలిపోయాయి. ఇటీవల నీరుపెట్టిన పొగాకు, మిరప తోటలు ఉరకెత్తుతాయని ఆందోళనకు గురవుతున్నారు. వర్షంలోనే చేలల్లో నీటిని బయటకు పంపేందుకు నానా తంటాలు పడుతున్నారు. శుక్రవారం విడతలు విడతలుగా వర్షం పడుతూనే ఉంది. ఇదే విధంగా కొనసాగితే కల్లాల్లో మిర్చి తడిసిపోయి బూజుపట్టే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. చేలో కోతదశలో ఉన్న మిర్చి వర్షానికి తడవటం వల్ల రంగుమారి నాణ్యత దెబ్బతినటంతో పాటు దిగుబడి తక్కువ వస్తుందని చెబుతున్నారు. వైట్‌ బర్లీ పొగాకు తడిసిపోవటం వల్ల మడ్డి కారిపోవటంతో పాటు దిగుబడి తగ్గుతుంది. దీని వలన ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉండదని రైతులు మనోవేదనకు గురవుతున్నారు.
పిట్టలవానిపాలెం: గత రాత్రి కురిసిన వర్షాలకు గాను పిట్టలవానిపాలెం మండలంలో వేసిన వేరుశనగ, మినుము, పెసర పైర్లకు, కోతకు వచ్చి కోసిన పొలాలలో నీరు నిలవ కుండా ఎప్పటికప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ సహాయకులు సుదర్శన్‌ అన్నారు. నీటిని పొలా లలో నిలవనీయకుండా బయటకు పంపించాలని పేర్కొన్నా రు. నేలలోని తేమ అధికంగా ఉన్నప్పుడు ఇనపధాతు లోపం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇక్కడ రైతులు గగ్గోలు పెడుతుంటే వ్యవసాయ అధికారి మాత్రం కనిపించటం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫోన్‌ ద్వారా సంప్రదిద్దాం అంటే స్పందన లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వ్యవ సాయ అధికారి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
పొలాల్లో నీరు లేకుండా చూడాలి
భారీ వర్షాలు కురిసినట్లయితే పొలాలలో నీరు నిలబడకుండా రైతులందరూ తగు చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి టి బాలాజీ గంగాధర్‌ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని రాంబట్లపాలెంలో మిర్చి, మినుము పొలాలను సందర్శించారు. శుక్రవారం వర్షాలు కురవడంతో పాటు, మరి రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మండల పరిధిలోని పలు గ్రామాలలో మినుము, పెసర, మొక్కజొన్న, మిర్చి పంటల రైతులు చేలలో నీరు నిలవకుండా చూసుకోవాలని సూచించారు. నీరు నిలబడితే మినుము, పెసర పైర్లలో 20 కేజీల యూరియా, 5 కేజీల పొటాష్‌ను కలిపి వెదజల్లుకోవాలని తెలిపారు. మొక్కజొన్న పొలానికి 50 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్‌ కలిపి పైపాటుగా వేసుకోవాలని సూచించారు. కోతకు వచ్చిన పొలాలను వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే కోయాలని పేర్కొన్నారు.