పల్నాడు జిల్లా: ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలు తీవ్ర వర్షా భావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్నాయని, వాటిని కాపాడేందుకు ప్రభుత్వం స్పందించి డెడ్ స్టోరేజ్ లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి పంటలకు అందించాలని పల్నాడు జిల్లా ఎపి రైతు,కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కోటప్పకొండ రోడ్డు లోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టిన నేపథ్యంలోనే ఎడమ కాలువ ద్వారా తెలంగాణ కి సాగు నీరు విడుదల చేశారని అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా కనీసం ఆరుతడికి కూడా నీరు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. సాగునీరు ఇవ్వలేమని ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎండిపోతున్న పంటలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో 5.12 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 3 లక్షల ఎకరాలకు లోపు సాగు చేశా రని, 2.40 లక్షల ఎకరాల భూమి బీడుగా ఉందని అన్నారు. రబీకి ముందు కురిసిన ఒక మోస్తరు వర్షానికి ఆరుతడి పం టలకు నీరు ఇస్తామని ఆరుతడి పంటలు సాగు చేసుకోవా లని అధికారులు చెప్పడంతో అధిక సంఖ్యలో రైతులు మిర్చి సాగు చేపట్టారన్నారు.
మంత్రి అంబటి రాంబాబును గడప గడపలో సాగు నీరు గురించి ప్రజలు ప్రశ్నిస్తే 'మీరు ఏ పార్టీ?' అని ఎదురు మాట్లాడడంతో పాటు దుర్భాష లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు విడుదల చేసి రైతులకు భరోసా కల్పించిన దాఖలాలే లేవని అన్నారు. గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించాలని, సాగునీరు విడుదల చేసే ఎండిపోతున్న పం టలు కాపాడాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు,రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి బాలకృష్ణ లు మాట్లాడుతూ ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కరువు తాండవిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఖరీఫ్ లో పంటలు సాగు చేసిన వారిలో అధిక శాతం కౌలు రైతులే ఉన్నారన్నారు.
ముందస్తు కౌళ్ళు చెల్లించి, ఏ పంటలు వేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న సాగు భూమిలో 65 శాతానికి పైగా కేవలం వరి సాగుకు మాత్రమే అను కూలమని, సాగర్ జలాలు లేకపోవడంతో చాలా వరకు సాగుభూములు బీళ్లుగా మారాయన్నారు. తక్షణమే సాగు నీరు విడుదల చేయక పోతే తమతో కలిసొచ్చే రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు లను ఐక్యం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు.










